Hanumakonda: హనుమకొండ ఓటరు జాబితా సవరణపై అధికారుల సమీక్ష

Hanumakonda: హనుమకొండలో ఓటరు జాబితా సవరణపై అబ్జర్వర్ హరి చందన సమీక్ష. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అధికారులకు ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 July 2026 3:39 PM IST
Hanumakonda
X

Hanumakonda: హనుమకొండ ఓటరు జాబితా సవరణపై అధికారుల సమీక్ష

హనుమకొండ: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026 (Special Intensive Revision–2026) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, తెలంగాణ రాష్ట్ర స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (SHAKTI) శాఖ కార్యదర్శి శ్రీమతి హరి చందన దాసరి, అధికారులను ఆదేశించారు.

శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై జిల్లా వారీగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఇంటింటి సర్వే, ఫారాల పంపిణీ, స్వీకరణ, మ్యాపింగ్, డిజిటలైజేషన్, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడం, అనర్హుల వివరాల పరిశీలన, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేశారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన ఓటరుకు ఓటు హక్కు కల్పించేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, కాలపట్టికను కచ్చితంగా పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా హరి చందన దాసరి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణపై ప్రజల్లో మరింత విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లు ఎందుకు దరఖాస్తు సమర్పించాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సమర్పించాలి, అవసరమైన పత్రాలు ఏమిటి, తరచుగా అడిగే ప్రశ్నలకు (FAQ) సమాధానాలు వంటి సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.

శాశ్వతంగా నివాసం మారిన వారు, వలస వెళ్లిన వారు, ఓటరు జాబితాలో మార్పులు చేయించుకోవాల్సిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, పనితీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సరైన సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs), గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఒక్క అర్హుడైన ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలని పేర్కొన్నారు.

జిల్లా అధికారులు ప్రతిరోజూ కార్యక్రమ పురోగతిని పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను సకాలంలో పరిశీలించి పరిష్కరించాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలు ఉన్నాయని, 5.09 లక్షల మంది ఓటర్లు, 483 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, 68.13 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు.

గైర్హాజరు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఎన్నికల అధికారులు, సూపర్‌వైజర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏలను నియమించి, వారికి గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులు, మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను నియమించామని తెలిపారు.

ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2కే రన్, మీడియా సమావేశాలు, ప్రచార వాహనాలు, బీఎల్‌ఏలకు శిక్షణ, ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా మిగిలిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

జిల్లా స్థాయిలో మీడియా మానిటరింగ్ సెంటర్, కలెక్టరేట్‌తో పాటు ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి దరఖాస్తుల పూరణలో సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరిస్తూ, కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై 48 గంటల్లోపు స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 71 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ పురోగతి, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు వివరించారు.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమం అమలులో చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాగా, 74 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 71.74 శాతం ఎస్‌ఐఆర్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపట్టిక మేరకు మిగిలిన ప్రక్రియను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాగా, 75.60 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి, హన్మకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, సంబంధిత జిల్లాల ఎన్నికల విభాగ అధికారులు,ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లు, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story