Hanumakonda: కాకతీయ జూ పార్కులో పులుల దినోత్సవం కలెక్టర్ హాజరు
Hanumakonda: హనుమకొండ కాకతీయ జూ పార్కులో అంతర్జాతీయ పులుల దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. విద్యార్థులకు బహుమతుల ప్రదానం.
Hanumakonda: కాకతీయ జూ పార్కులో పులుల దినోత్సవం కలెక్టర్ హాజరు
హనుమకొండ: పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం వన్యప్రాణులను కాపాడుకోవడం అత్యంత అవసరమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూ పార్కులో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి ముకుంద రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పులి వన్యప్రాణుల్లో అత్యంత కీలకమైన జాతి అని, అడవుల పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పులుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. ఒకప్పుడు పులుల వేట విస్తృతంగా జరిగేదని, అటవీశాఖ చేపట్టిన కఠిన చర్యలతో అక్రమ వేట గణనీయంగా తగ్గి, దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు.
దేశంలో చిరుతల (చీతాలు) సంఖ్య తగ్గిపోవడంతో వాటిని ఇతర ఖండాల నుంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో ప్రస్తుతం ఒక్క పులి కూడా లేకపోవడం ఆందోళనకరమని, అదే సమయంలో సమీపంలోని మహారాష్ట్ర తడోబా అభయారణ్యంలో పులుల సంఖ్య గణనీయంగా ఉందని తెలిపారు.
అడవులు, వన్యప్రాణులు అంతరించిపోకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందించుకొని, వాటి పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా అటవీశాఖ అధికారి ముకుంద రెడ్డి మాట్లాడుతూ, అంతరించిపోతున్న పులులతో పాటు ఇతర వన్యప్రాణులను సంరక్షించడం సమాజం మొత్తం బాధ్యత అని అన్నారు. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, వాటి నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం అవసరమని తెలిపారు. భావితరాలకు ప్రకృతి సంపదను అందించాలంటే విద్యార్థులు వన్యప్రాణుల సంరక్షణలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వోలు మయూరి, శిరీష, శ్రీనివాస్, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రతినిధి శ్యామ్ సుందర్, వివిధ పాఠశాలల విద్యార్థులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




