Hanamkonda: భూముల రీ-సర్వేను వేగవంతం చేయాలి ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి

Hanamkonda: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో భూముల రీ-సర్వేను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి. రైతుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 4 Aug 2026 7:09 PM IST
Hanamkonda
X

Hanamkonda: భూముల రీ-సర్వేను వేగవంతం చేయాలి ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి

హనుమకొండ: భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే రైతులకు తెలియజేసి వారి సహకారంతో పనులు చేపట్టాలని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి సర్వేయర్లను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో భూములు కొలతల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను ఇన్‌చార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమికి రీ-సర్వే పూర్తయిందని, రోజువారీగా ఎంత విస్తీర్ణంలో సర్వే నిర్వహిస్తున్నారని, ఎన్ని రోవర్ పరికరాలతో సర్వే చేపడుతున్నారని సర్వేయర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి రీ-సర్వే ప్రక్రియ, పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం గ్రామంలో రెండు సర్వే బృందాలు రీ-సర్వే పనులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ, ప్రతి సర్వే బృందం రోజుకు కనీసం 75 ఎకరాల భూమిని రీ-సర్వే చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. సర్వే ప్రారంభానికి ముందే కార్యాచరణ రూపొందించి, ఆయా ప్రాంతాల రైతులకు తేదీలు, సమయాలపై ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు.

రైతుల సమన్వయంతో, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం ప్రతిరోజూ రీ-సర్వే చేపడితే ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సర్వే పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా రీ-సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలనలో భూములు కొలతల శాఖ సహాయ సంచాలకులు నూర్ సింగ్, ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్, సర్వేయర్ సూరజ్ కుమార్, జీపీవో శ్రీకాంత్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story