Hanumankonda: ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం - ఎమ్మెల్యే!

Hanumankonda: హనుమకొండలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు. విశ్వేశ్వరయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. జడ్పీ నూతన భవనానికి నిధుల సాధనకు కృషి.

Sowmya
Published on: 15 Sept 2026 5:41 PM IST
Hanumankonda
X

Hanumankonda: ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం - ఎమ్మెల్యే!

Hanumankonda: ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు.

ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ప్రజాప్రతినిధుల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. స్థానిక ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భారతదేశ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దేశ నిర్మాణంలో అందించిన సేవలు, ఇంజనీరింగ్ రంగానికి చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు అందించడంలో ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

హనుమకొండ జిల్లా ప్రజాప్రతినిధుల కార్యాలయ పరిధిలోని జడ్పీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారిని కోరారు.జడ్పీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

శిథిలావస్థకు చేరుకున్న భవనం స్థానంలో ఆధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయ భవనం ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.వచ్చే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, చారిత్రక ఆర్ట్స్ కాలేజ్‌తో పాటు కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా అవసరమైన నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలిపారు.

వరంగల్ నగరానికి విద్యా, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతను మరింత పెంచే విధంగా ఆర్ట్స్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. విద్యా సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇ.వి శ్రీనివాస్ రావు మరియు స్థానిక ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sowmya

Sowmya