Bayyaram: బయ్యారం చెరువుకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని నిరసన

Bayyaram: బయ్యారం చెరువుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు మళ్లించాలని ఏఐకేఎంఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బయ్యారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా.

NARASIMHARAO, BAYYARAM
Published on: 24 Aug 2026 3:15 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారం చెరువుకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని నిరసన

బయ్యారం: ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు తగినంతగా పడలేదని,ఇప్పటివరకు బయ్యారం చెరువు అలుగు పడకుండా ఉన్న చరిత్ర గత 40 సంవత్సరాలలో ఏనాడూ లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు ఇవ్వడమే కరువు నివారణకు శాశ్వత పరిష్కారం మార్గం అని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, మోకాళ్ళ మురళీకృష్ణలు అన్నారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈరోజు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో బయ్యారం మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసిల్దార్ మెమోరన ఇవ్వడం జరిగింది, ధర్నానుద్దేశించి గౌని ఐలయ్య మాట్లాడుతూ...

అధికారులు ఆరుతడి పంటలు వేసుకోండి అని చెబుతున్నప్పటికీ బయ్యారం చెరువు కాలువలు శిథిలావస్థలో ఉన్నందున బయ్యారం చెరువు కింద భూములు ఆరుతడి పంటలకు అనుకూలం కావని, తూము తీస్తే నీళ్లన్నీ లోతట్టు పొలాల్లో వారాల తరబడి నిలువ వుండి పైర్లన్నీ కుళ్ళి పోతాయని అన్నారు.

దీనితో పాటు చెరువు నిండక పోతుందా అనే ధీమాతో ఇప్పటికే చాలామంది వడ్లు అలకటం, నాట్లు వేయటం చేశారని,ఇప్పుడు అధికారులు తూముకు సీలు వేయడంతో వేసిన నాట్లు, నారుమడులు కూడా ఎండిపోతున్నాయని,వరి వేయవద్దనటంతో తమ భూములు ఆరుతడి పంటకు అనుకూలంగా లేనందున చాలా మంది ఏ పంట వేయకుండా వదిలేస్తున్నారన్నారు. నాట్లు వేసిన వాళ్ళు ఇప్పటికే ఎకరానికి 15 వేల నుండి 20 వేల వరకు పెట్టుబడి పెట్టారని,నాట్లు వేయని రైతులు కూడా నార్లు పోసుకొని దుక్కులు దున్నుకొని ఎకరానికి 10,000 వరకు పెట్టుబడి పెట్టుకొని ఉన్నారని.

మొక్కజొన్న పత్తి తదితర పంటలకు కూడా ఇప్పటికే ఎకరానికి 15 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టి, కొందరు బ్యాంకుల నుండి , మరికొందరు ప్రైవేటు వ్యాపారస్తుల నుండి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని ఎరువులు కొనుక్కొని ఎదురుచూస్తున్న రైతులు, ఈ వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని,కరువు సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు వర్షాలు పడకుండా ఎవరో క్షుద్ర పూజలు చేశారని బుద్ధిలేని మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతున్నారన్నారు.

మండలానికి గోదావరి నీళ్లు రాకుండా పాలకులు అడ్డుకొంటున్నారని, బయ్యారం, గార్ల చెరువులతోపాటు ఏజెన్సీ మండలాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇస్తామని ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇచ్చి డిపిఆర్ లో కూడా పేర్కొన్నదని,ఆ మేరకు నాటి ముఖ్యమంత్రి ఇల్లందు నియోజకవర్గం లోని రోళ్లపాడు చెరువులోనే 2016 ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు.

కానీ ఫేస్ 1 పనులను పక్కనపెట్టి, శంకుస్థాపన చేసిన రోళ్ళపాడు చెరువు తోపాటు బయ్యారం, గార్ల చెరువులను వదిలేసి డైరెక్ట్ గా పాలేరుకు తీసుకుపోయే కెనాల్ పనులను ఆగమేఘాల మీద పూర్తి చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇవ్వలేదని ,కేవలం నాగార్జునసాగర్ ఆయకట్టు భూములకు రెండవ, మూడవ పంటలకు గ్యారంటీ ఇచ్చే ప్రాజెక్టుగానే సీతారామ ప్రాజెక్టు మిగిలిపోయిందని అన్నారు.

రెండున్నర ఏండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి నీళ్లు ఇవ్వకపోగా బయ్యారం, గార్ల మండలాల తలాపున ఉన్న మున్నేరు నీళ్లను కూడా పాలేరు తరలిస్తూ అంతకుమించిన అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. గోదావరి జలాలను బయ్యారం చెరువుకు ఇవ్వడమే కరువు నివారణకు శాశ్వత పరిష్కారమని ఐలయ్య, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ లన్నారు. తక్షణమే గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం చెరువుకు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బానోతు నరసింహ, తోకల వెంకన్న నాయకులు మాజీ ఎంపీపీ ఊకే పద్మ,మాజీ పిఎసిఎస్ చైర్మన్ రామగిరి బిక్షం, తుడుం వీరభద్రం, మాదంశెట్టి నాగేశ్వరరావు, నేతకాని రాకేష్,మేకపోతుల నాగేశ్వరరావు, ఏపూరి వీరభద్రం, బొల్లం సోమక్క, యాతం రమణారెడ్డి, కొదుమూరి నాగేశ్వరరావు, భూక్యా రాము, బానోత్ హోలీ నూతక్కి భూషణ్ రావు, మెంగు భగవాన్, ఎస్.కె మహమూద్, యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story