Hanumakonda: రోడ్డు భద్రతపై హనుమకొండ కలెక్టర్, సీపీ కీలక సమీక్ష!

Hanumakonda: హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సీపీ ఎన్. శ్వేత అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 25 Aug 2026 9:39 PM IST
Hanumakonda
X

Hanumakonda: రోడ్డు భద్రతపై హనుమకొండ కలెక్టర్, సీపీ కీలక సమీక్ష!

హనుమకొండ: మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో రోడ్లు, భవనాలు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రోడ్డు భద్రత సంబంధించి చేపట్టిన చర్యల గురించి ఆర్ అండ్ బి ఈఈ దేవిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ... ప్రతీ వాహనదారులు రోడ్ భద్రత నియమాలను పాటించాలని తెలిపారు. ప్రైవేట్ బస్సులు, టాక్సీ వాహనాలు రోడ్ల పక్కన నిలిపి ఉంచడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, రంగలీలా మైదానం, హయాగ్రీవాచారి మైదానంలో నిలిపేవిధంగా మున్సిపల్, కుడా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులపై హద్దులకు సంబంధించి లైన్ మార్కింగ్ స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలన్నారు. వాహనాలను ఇష్టారీతిన పార్కింగ్ చేయకుండా నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రహదారులపై విద్యుద్దీపాలు వెలిగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు బాధితుల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో సమీప ఆసుపత్రులను గుర్తించి అక్కడికి తరలించే విధంగా అత్యవసర వాహనాల డ్రైవర్లకు, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నార. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి త్వరగా క్షత్రగాత్రులను వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్స్ కు తరలించేలా మ్యాపింగ్ చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న హసన్ పర్తి చెరువు కట్ట వద్ద రహదారి వెడల్పు చేయడం జరిగిందని, రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలని, పోతన నగర్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

రోడ్డును ఆనుకుని హెవీ వెహికల్స్, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు పార్కు చేసి ఉంటున్నాయని, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలా కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా.... సిటీ కి దూరంగా వాహనాలు పార్కు చేసే ప్రదేశాలను అధికారులు గుర్తించాలన్నారు. ప్రైవేట్ బస్సులు, వాహనాలు రోడ్డు పక్కన ఇష్టారీతిన నిలిపి ఉంచుతున్నారని, వాహన యజమానులతో అధికారులు మాట్లాడి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

నగరంలో ఫుట్ పాత్ లను ఆక్రమించడంతో.... పాదాచారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, స్ట్రీట్ వెండర్స్ కోసం వెండింగ్ జోన్లు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించాలని సూచించారు. స్ట్రీట్ వెండర్స్ ఎక్కడపడితే అక్కడ విక్రయాలు చేయకుండా, స్ట్రీట్ వెండింగ్ జోన్లలోనే విక్రయాలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.

స్ట్రీట్ వెండర్స్ కోసం వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. గణపతి విగ్రహాలు ప్రధాన రహదారుల పక్కన కాకుండా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఖాళీ మైదానంలో క్రయ విక్రయాలు చేసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story