Hanamkonda: సీఎంఆర్ డెలివరీల్లో జాప్యం వద్దు: కలెక్టర్ రవి హెచ్చరిక!
Hanamkonda: సీఎంఆర్ బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లపై ఆర్‌ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు.
Hanamkonda: సీఎంఆర్ డెలివరీల్లో జాప్యం వద్దు: కలెక్టర్ రవి హెచ్చరిక!
హనుమకొండ, ఆగస్టు 1, 2026: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు అప్పగించడంలో ఎలాంటి జాప్యం ఉండరాదని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి స్పష్టం చేశారు.
శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సీఎంఆర్ డెలివరీ మానిటరింగ్ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా 2025–26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీల పురోగతిని సమీక్షించారు.
ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ, కేటాయించిన రైస్ మిల్లులను మానిటరింగ్ అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి, మిల్లులు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. మిల్లులు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తున్నాయి, ఎంత పరిమాణంలో ధాన్యం మిల్లింగ్ చేస్తున్నాయి, ఇప్పటివరకు ఎంత మేర సీఎంఆర్ సిద్ధం చేసి ఎఫ్‌సీఐకి అందజేశాయనే వివరాలను ప్రతిరోజూ తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని మానిటరింగ్ అధికారులు, సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు.
సీఎంఆర్ బకాయిలు అధికంగా ఉన్న రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్ డెలివరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఒక్క ఏసీకే కూడా సమర్పించని రైస్ మిల్లర్లు వెంటనే మిల్లింగ్ కార్యకలాపాలు ప్రారంభించి, సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా యాక్షన్ ప్యాడీకి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని సూచించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టం ప్రకారం చర్యలు చేపట్టి, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్ల కోసం వారి ఆస్తులను జప్తు చేసే ప్రక్రియను సంబంధిత తహసీల్దార్లు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ డెలివరీల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మహేందర్, ఎఫ్‌సీఐ ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్ ప్రసన్న కుమార్, సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సీఎంఆర్ డెలివరీ మానిటరింగ్ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.




