Jangaon: కోమల్లలో రైతు పొలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్!

Jangaon: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లలో బహుళ అంతస్తుల సాగు (Multi Storied Farming) చేస్తున్న రైతు పొలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 12 Aug 2026 1:59 PM IST
Jangaon
X

Jangaon: కోమల్లలో రైతు పొలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్!

Jangaon: బుధవారం, జిల్లాలోని రఘునాథపల్లి మండలం, కోమల్ల గ్రామంలో బహుళ అంతస్తుల వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న రైతు మంద రాములు వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు.

సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో రైతు చేపడుతున్న వివిధ రకాల పంటల సాగు విధానం, సాగునీటి సదుపాయాలు, పంటల నిర్వహణ, దిగుబడులు, మార్కెటింగ్, తదితర అంశాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ వ్యవసాయ క్షేత్రంలో మునగ, సపోటా, సీతాఫలం, అరటి, అంజీర్, నిమ్మ వంటి ఉద్యాన పంటలతో పాటు బీరకాయ, సొరకాయ, తదితర కూరగాయల పంటలను రైతు సాగు చేస్తున్నట్లు కలెక్టర్‌ కు వివరించారు.

ఒకే భూమిలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందే విధంగా చేపడుతున్న బహుళ అంతస్తుల సాగు (Multi-storied Farming) విధానాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు.

రైతుతో మాట్లాడిన కలెక్టర్, వివిధ పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ (లేదా) ఇతర ప్రోత్సాహకాలు అందాయా? సాగు కోసం రైతు చేసిన పెట్టుబడి ఎంత? పంటల నిర్వహణకు ఎంత ఖర్చు అవుతోంది? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయ క్షేత్రానికి ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం గురించి కూడా ఆరా తీశారు. పంటలకు అవసరమైన నీటిని పొదుపుగా వినియోగిస్తూ, ప్రతి మొక్కకు తగిన మోతాదులో నీరు అందేలా డ్రిప్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన మోటార్‌కు సంబంధించిన ఖర్చు, నీటి లభ్యత, సాగునీటి వినియోగ విధానాన్ని కూడా కలెక్టర్ ఆరా తీశారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసేలా ఆధునిక సాగు పద్ధతులను రైతులు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.

కూరగాయలు, ఇతర పంటల ఉత్పత్తులను ప్రస్తుతం ఎక్కడ విక్రయిస్తున్నారో రైతును అడిగి తెలుసుకున్న కలెక్టర్, పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.

రైతులు పండించిన ఉత్పత్తులకు స్థానికంగా మాత్రమే కాకుండా సమీప మార్కెట్లు, రైతు బజార్లు, ఇతర విక్రయ కేంద్రాల్లో మెరుగైన ధర లభించేలా మార్కెటింగ్ అవకాశాలను అన్వేషించాలని సూచించారు.

పంటలను పురుగులు, తెగుళ్ల నుంచి రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పంటలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహిస్తూ, పురుగుల ఉద్ధృతి గుర్తించిన వెంటనే వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు తీసుకొని, తగిన నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

అదే విధంగా పొలంలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, పంటల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

కూరగాయల పంటలకు అవసరమైన పందిర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. బీరకాయ, సొరకాయ, వంటి తీగజాతి కూరగాయలకు పందిర్లు ఏర్పాటు చేయడం ద్వారా మొక్కల పెరుగుదల మెరుగుపడి, పంట నాణ్యత పెరగడంతో పాటు పురుగులు, తెగుళ్ల ప్రభావాన్ని కొంత మేర నియంత్రించవచ్చని తెలిపారు.

రైతుకు అవసరమైన పందిర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను పరిశీలించి, అర్హత మేరకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామంలో ఇలాంటి వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతులను గుర్తించి, వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలనలో డీఏఓ అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్, కేవీకే శాస్తవేత్త రమ్య, ఉద్యానవన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story