Mulugu: కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు రాఖీలు కట్టిన బాలికలు!
Mulugu: బాలికల విద్యే దేశ సాధికారతకు పునాది అని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ములుగు కలెక్టర్‌కు రాఖీ కట్టిన బాలసదనం బాలికలు.
Mulugu: కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు రాఖీలు కట్టిన బాలికలు!
Mulugu: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదనం బాలికలు శుక్రవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును కలిసి రాఖీలు కట్టారు.
“బాలికను చదివిద్దాం–దేశాన్ని సాధికారత వైపు నడిపిద్దాం” అనే సందేశంతో ప్రత్యేకంగా రూపొందించిన రాఖీలను కలెక్టర్‌కు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బాలికలను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించడంతోపాటు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలికలతో మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
బాలికల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, భద్రత, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి మెరుగైన సేవలు అందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాలికల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందిస్తుందని భరోసా కల్పించారు.
జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత మాట్లాడుతూ రక్షాబంధన్ ప్రేమానుబంధంతోపాటు పరస్పర బాధ్యత, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఒక బాలికను చదివించడం ద్వారా ఆమె భవిష్యత్తుతోపాటు కుటుంబం, సమాజం, దేశ పురోగతికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. బాలికలకు సురక్షితమైన వాతావరణం, సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలల సహాయవాణి జిల్లా సమన్వయకర్త నరేష్, బాలసదనం సిబ్బంది అరుణ, రాణి, సఖి కేంద్రం సిబ్బంది లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




