Hanamkonda: నేడే సివిల్స్ ప్రిలిమ్స్ ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

Hanamkonda: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.

AJAY, HANMAKONDA
Published on: 23 May 2026 4:28 PM IST
Hanamkonda
X

Hanamkonda: నేడే సివిల్స్ ప్రిలిమ్స్ ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

హనుమకొండ: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–2026 నిర్వహణకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. శనివారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోని ప్రతి గదిలో సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

పరీక్ష నిర్వహణకు సంబంధించిన మెటీరియల్‌ను పరిశీలించడంతో పాటు తాగునీరు, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను తనిఖీ చేశారు. హాల్ టికెట్ నెంబరింగ్, ఇన్విజిలేటర్లు, రూట్ అధికారులు మరియు ఇతర సిబ్బంది విధులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (24-05-2026) రెండు సెషన్లలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 4,075 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు.

పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేయబడతాయని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గడియారాలు తీసుకురావద్దని సూచించారు.

హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లాలోని హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఫాతిమానగర్‌లోని సెయింట్ గాబ్రియల్ హై స్కూల్, హంటర్ రోడ్డులోని న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్, అడ్వకేట్స్ కాలనీలోని ఎస్సార్ నేషనల్ హై స్కూల్, వడ్డేపల్లిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, భద్రకాళి దేవాలయం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, లాల్ బహుదూర్ కళాశాల మరియు అశోక జంక్షన్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.

పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ సెంట్రల్ ఇన్‌స్పెక్షన్ అధికారి శుభం గాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ ఎస్.ఎం. రెహమాన్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, రూట్ అధికారి భావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story