Hanamkonda: హనుమకొండలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మెరుపు తనిఖీలు..
Hanamkonda: హనుమకొండలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయి వర్షంలోనూ పర్యటించి, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీల నాలాలు మరియు గోపాల్‌పూర్ చెరువు పనులను పరిశీలించారు.
Hanamkonda: హనుమకొండలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మెరుపు తనిఖీలు..
హనుమకొండ, జూలై 29: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాలాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.
బుధవారం హనుమకొండ 100 ఫీట్ల రోడ్డులోని అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ (ఎస్‌పీఆర్ పాఠశాల సమీపం) వద్ద ఉన్న ప్రధాన నాలాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షం కురుస్తున్నప్పటికీ టీవీ టవర్ కాలనీలో అధికారులతో కలిసి కాలినడకన వెళ్లి నాలాల పరిస్థితిని పరిశీలించి, నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం గోపాల్‌పూర్ ఊర చెరువు వద్ద చేపట్టిన పూడికతీత పనులను, చెరువు కట్ట (బండ్) పరిస్థితిని పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నాలాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా నిరంతరం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, నాలాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ పరిశీలనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, ఇరిగేషన్ డీఈ కిరణ్ కుమార్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, డీఈ సారంగం, ఏఈ అనిల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




