Kurupam: డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి: పుష్పశ్రీవాణి!

Kurupam: డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కురుపాంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

V.SESHU	, KURUPAM
Published on: 6 Aug 2026 8:22 PM IST
Kurupam
X

Kurupam: డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి: పుష్పశ్రీవాణి!

కురుపాం, ఆగస్టు 6: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి నాయకత్వం వహించారు.

తొలి రోజు జరిగిన దీక్షల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, అభిమానులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు వస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, డీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో పారదర్శకత లోపించిందనే అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయని అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుండగా, వారి భవిష్యత్తుతో ఆటలాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అక్రమాలకు రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆగస్టు 9వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయని పార్టీ నాయకులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలను నివృత్తి చేయాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story