Vizianagaram: సీతం కళాశాలలో ఘనంగా లైబ్రేరియన్స్, యువజన దినోత్సవం

Vizianagaram: విజయనగరం సీతం కళాశాలలో నేషనల్ లైబ్రేరియన్స్ అండ్ ఇంటర్నేషనల్ యూత్ డే వేడుకలు. హాజరైన ప్రముఖులు, విద్యార్థులు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 12 Aug 2026 4:10 PM IST
Vizianagaram
X

Vizianagaram: సీతం కళాశాలలో ఘనంగా లైబ్రేరియన్స్, యువజన దినోత్సవం

విజయనగరం: స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో జాతీయ లైబ్రేరియన్స్ దినోత్సవం మరియు అంతర్జాతీయ యువజన దినోత్సవంలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల సెంట్రల్ లైబ్రరీ, ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్‌మెంట్ సెల్ మరియు ఇన్‌స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించారు. భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు పద్మశ్రీ డా. ఎస్. ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ లైబ్రేరియన్స్ దినోత్సవాన్ని, అలాగే యువతలో జ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లైబ్రేరియన్, సెంచూరియన్ యూనివర్సిటీ, విజయనగరం శ్రీ జి. ఎస్. ఎన్. రాజు మరియు సీఈఓ – వే్జ్జిస్& తాజామిల్క్, వైస్ ప్రెసిడెంట్ – ఎవేరిట్స్ , బిల్డింగ్ టెక్ పవర్డ్ డెలివరీ & డైరీ బిజినెస్సెస్ , ఇంట్రెప్రెనేర్ & ఇన్నోవటర్ శ్రీ బదరీనాథ్ కొలుకులూరి అలాగే అతిథులుగా డైరెక్టర్ ఐఐఏఎం విశాఖపట్నం డాక్టర్ శివాజీ, మరియు ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు శ్రీ సాయికుమార్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.

ముఖ్య అతిథి శ్రీ జి. ఎస్. ఎన్. రాజు మాట్లాడుతూ, విద్యార్థుల జ్ఞానాభివృద్ధిలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పుస్తక పఠనంతో పాటు ఈ-పుస్తకాలు, ఈ-జర్నల్స్, ఆన్‌లైన్ డేటాబేస్‌లు మరియు ఇతర డిజిటల్ సమాచార వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత తమ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి గ్రంథాలయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

మరో ముఖ్య అతిథి శ్రీ బదరీనాథ్ కొలుకులూరి మాట్లాడుతూ, ప్రస్తుత సాంకేతిక యుగంలో జ్ఞానం, నూతన ఆలోచనలు మరియు ఆవిష్కరణలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత తమలోని ప్రతిభను గుర్తించి, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు మరియు పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు.

కళాశాల డైరెక్టర్ డా. మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ గ్రంథాలయ సేవలను మరింత అభివృద్ధి చేయడానికి కళాశాల కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఈ-వనరులు, డిజిటల్ గ్రంథాలయం మరియు ఆన్‌లైన్ సమాచార వనరులను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. వి. రామమూర్తి మాట్లాడుతూ, గ్రంథాలయం విద్యార్థుల విద్యాభ్యాసంలో అంతర్భాగమని తెలిపారు. ప్రతి విద్యార్థి పఠనాన్ని తన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ విజ్ఞాన, సాంకేతిక మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను చదవాలని సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, నైపుణ్యం మరియు సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని తెలిపారు.

ఈడిసి కన్వీనర్ డా. జి. రవి కిషోర్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పోషించాల్సిన కీలక పాత్రను నొక్కిచెప్పారు.

ఐ ఐ సి అధ్యక్షురాలు డా. వి. జి. ప్రసూన మాట్లాడుతూ విద్యార్థులు పఠనం, నిరంతర అభ్యాసం, ఆవిష్కరణలు, ఔత్సాహికత మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని తమ విద్యా మరియు వ్యక్తిగత అభివృద్ధిలో అంతర్భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చరు. ఈడిసి మరియు ఐ ఐ సి ల సంయుక్త కృషి ద్వారా విద్యార్థుల్లో ఆవిష్కరణలు, ఔత్సాహిక ఆలోచనా విధానం, జ్ఞాన సృష్టి మరియు సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించడంలో సీతం తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.

కళాశాల చీఫ్ లైబ్రేరియన్ డా. ఎల్. సత్యవతి మాట్లాడుతూ, జాతీయ లైబ్రేరియన్స్ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. డా. ఎస్. ఆర్. రంగనాథన్ గ్రంథాలయ రంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆధునిక కాలంలో గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను అందించే కేంద్రాలుగా కాకుండా, విద్యార్థులకు ముద్రిత మరియు డిజిటల్ సమాచార వనరులను అందించే జ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అలాగే యువతలో పఠనాభిరుచి, జ్ఞానార్జన, సృజనాత్మకత మరియు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ ప్రాముఖ్యత, పుస్తక పఠనం మరియు యువత పాత్రపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, గ్రంథాలయ సిబ్బంది, , బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story