Salur: ఆగస్టు 6 నుంచి మెగా డీఎస్సీ బాధితుల రిలే నిరాహార దీక్షలు
Salur: సాలూరులో మెగా డీఎస్సీ బాధితుల కోసం ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న భారీ ర్యాలీ. వైఎస్సార్‌సీపీ మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపు.
Salur: ఆగస్టు 6 నుంచి మెగా డీఎస్సీ బాధితుల రిలే నిరాహార దీక్షలు
సాలూరు: సాలూరు పట్టణంలోని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పీడిక రాజన్నదొర నివాసంలో ఈరోజు సాలూరు నియోజకవర్గ పరిధిలోని సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు మరియు సాలూరు మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భాగంగా ఆగస్టు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలు,ఆగస్టు 10న చేపట్టనున్న భారీ ర్యాలీ విజయవంతానికి అవసరమైన కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ప్రతి మండలం,సాలూరు టౌన్ నుంచి 10 నుంచి 15 మంది చొప్పున దీక్షల్లో పాల్గొనే వారి జాబితాలను ఫోన్ నంబర్లతో సహా ముందుగానే అందజేయాలని నిర్ణయించారు.
దీక్షల్లో పాల్గొనే వారు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు దీక్షా శిబిరానికి చేరుకోవాలని,ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో సంబంధిత మండలాల ముఖ్య నాయకులు తప్పనిసరిగా పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని సూచించారు.
ఆగస్టు 10న ఉదయం 9.30 గంటలకు సాలూరు ఆఫిషియల్ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని,ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే భారీ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని,నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని,20 లక్షల ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్,వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలను అమలు చేయాలని,50 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని విస్తృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
అదేవిధంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని,బీఎల్‌ఏలు ఓటరు జాబితాల పరిశీలన, ఫారాలు 6,7,8 ద్వారా నమోదు,మార్పులు, తొలగింపులు పూర్తి చేయాలని,రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సాలూరు, పాచిపెంట,మెంటాడ, మక్కువ మండలాలు, సాలూరు మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్‌సీపీ తాజా,మాజీ ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.




