Parvathipuram: ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీ.. నిర్లక్ష్యం వహిస్తే వేటు!
Parvathipuram: మన్యం జిల్లా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభాకరరెడ్డి. వైద్య సేవలు, భోజనం నాణ్యత పరిశీలించి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
Parvathipuram: ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీ.. నిర్లక్ష్యం వహిస్తే వేటు!
పార్వతీపురం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం స్థానిక జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, రోగులకు అందిస్తున్న సేవలు, ఆహారం తదితర ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.
అనంతరం వార్డులలోని చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. డాక్టర్లు సకాలంలో వస్తున్నారా? మందులు ఉచితంగా ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది ప్రవర్తనపై రోగుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వైద్యులు మరియు నర్సులు రోగులతో ప్రేమగా వ్యవహరించాలని, వారికి ధైర్యం చెప్పాలని సూచించారు.
ప్రత్యేకంగా ప్రసూతి వార్డును సందర్శించి, గర్భిణీలకు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. కాన్పుల వివరాలు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. పారిశుధ్యం మరింత మెరుగ్గా ఉండాలని, వార్డులు, టాయిలెట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆర్.ఎం.ఓ మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసి, విధులకు సిబ్బంది గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.ఆసుపత్రిలో రోగులకు సరఫరా అవుతున్న ఆహారాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
వంటగది, స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి, భోజనం నాణ్యతను, వండే పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.రోగులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని ఆదేశించారు. భోజనం విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని హెచ్చరించారు.
ఈ తనిఖీలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నాగ శివజ్యోతి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డా. జి. నాగభూషణరావు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




