Parvathipuram: సరిహద్దుల్లో ఎక్సైజ్ దాడులు - సారా, బెల్లం ఊట ధ్వంసం
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దుల్లో 'నవోదయం 2.0'లో భాగంగా ఎక్సైజ్ దాడులు. 200 లీటర్ల సారా, 8200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన అధికారులు.
Parvathipuram: సరిహద్దుల్లో ఎక్సైజ్ దాడులు - సారా, బెల్లం ఊట ధ్వంసం
పార్వతీపురం: మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ సారా తయారీపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. ‘నవోదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఒడిశా పోలీసు లు మరియు రాయగడ ఎక్సైజ్ సిబ్బంది సహకారంతో నిర్వహించిన భారీ అంతర్రాష్ట్ర దాడుల్లో ఏకంగా 8200 లీటర్ల బెల్లం ఊటను , 200 లీటర్ల నాటు సారా ను అధికారులు గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఒడిశా సరిహద్దు గ్రామాల్లో సంయుక్త తనిఖీలు
మంగళగిరి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్, జిల్లా ఎక్సైజ్ అధికారుల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని రాయగడ పోలీసు సిబ్బంది సమన్వయంతో, సరిహద్దు ప్రాంతాలైన రాయగడ జిల్లా మొరం గ్రామంలో సారా తయారీ స్థావరాలపై ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాయి.
ఈ అంతర్రాష్ట్ర దాడుల్లో కురుపాం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, పాలకొండ BMPP సిబ్బంది,పార్వతీపురం ఈఎస్‌టీఎఫ్ (ESTF) మరియు విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. దాడుల్లో పట్టుబడిన నాటు సారా మరియు నాటు సారా తయారీ పదార్థాలను (బెల్లం ఊట) అధికారులు స్వాధీనం చేసుకుని నాశనం చేశారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ఎ. సంతోష్ మాట్లాడుతూ — "సరిహద్దు గ్రామాలను ఆసరాగా చేసుకుని అక్రమ సారా తయారీ, రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. నవోదయం 2.0 లో భాగంగా ఇలాంటి అంతర్రాష్ట్ర దాడులు నిరంతరం కొనసాగుతాయి" అని స్పష్టం చేశారు.




