Parvathipuram: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్!
Parvathipuram: APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 163 పోస్టుల భర్తీ. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర రెడ్డి సూచన.
Parvathipuram: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్!
Parvathipuram: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 163 ఖాళీలను భర్తీ చేయనున్నారని ఆయన తెలిపారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్ (11), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (14), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (36), డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (14), డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (35) సహా పలు ఇతర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 06వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పోస్ట్ కోడ్ 04 తప్ప మిగిలిన అన్ని పోస్టులకూ ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ విద్యార్హత ఉండాలని, పోస్ట్ కోడ్ 04కు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో B.E./B.Tech చేసి ఉండాలని వివరించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇప్పటినుండే ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వయోపరిమితి, ఫీజు వివరాలు మరియు ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ప్రతిరోజూ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.




