Parvathipuram: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

Parvathipuram: గ్రామ సచివాలయాలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 Aug 2026 5:52 PM IST
Parvathipuram
X

Parvathipuram: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

పార్వతీపురం: జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయ భవనాలు మరియు వివిధ ప్రముఖ ప్రాంతాల్లో చేపట్టిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC), అంగన్వాడీల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ మండలాల్లో మంజూరైన ప్రతి శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. డివిజన్ల వారీగా పనుల పురోగతిని పరిశీలించిన ఆయన జిల్లావ్యాప్తంగా మంజూరైన 81 పనుల్లో 53 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం రూఫ్ లెవెల్ (స్లాబ్) దశలో ఉన్న 23 పనులను, బేస్‌మెంట్ దశలో ఉన్న 4 పనులను అలసత్వం వహించకుండా త్వరితగతిన పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. బలిజిపేట, సీతానగరం, పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాల్లో పనులు వేగంగా సాగుతున్నాయని, మిగిలిన పనులను కూడా నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.

​మరోవైపు జిల్లాలో మొత్తం మంజూరైన 513 అంగన్వాడీ టాయిలెట్లకు గాను, ఇప్పటివరకు 459 టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని, పురోగతిలో ఉన్న మిగిలిన 36 పనులను త్వరగా ముగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే మంజూరైన 623 తాగునీటి పనుల్లో ఇప్పటికే 604 పనులు పూర్తయ్యాయని వివరాలను వెల్లడించారు. పూర్తయిన కాంప్లెక్స్‌లకు సంబంధించిన పార్ట్ మరియు ఫైనల్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని సూచించారు.

కురుపాం, పాలకొండ, సాలూరు డివిజన్ పరిధిలోని మండల అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం,తాగునీరు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు,ఎంపీడీఓలు,సంబంధిత డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story