Vizianagaram: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణ శిల్పులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Vizianagaram: విజయనగరం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పాల్గొని 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 5 Sept 2026 4:45 PM IST
Vizianagaram
X

Vizianagaram: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణ శిల్పులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం: విజయనగరం భావి తరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారిక శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, తమ శిష్యులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే ఉపాధ్యాయులకు నిజమైన గర్వకారణమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారిక శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలుగు తల్లి, భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి ప్రతి విద్యార్థి ప్రత్యేక వ్యక్తిత్వం, భిన్నమైన ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని, వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఒక విద్యార్థి బలాలను గుర్తించి, “నువ్వు చేయగలవు.. నువ్వు విజయం సాధించగలవు” అంటూ ప్రోత్సహించే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందన్నారు. ఉపాధ్యాయుల ప్రేరణ విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, సమాజానికి ఉత్తమ పౌరులను అందిస్తుందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 1,90,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, ఇటీవల 16,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు విద్యార్థుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యా ప్రగతి, ఆసక్తులు, సామర్థ్యాలు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించడంలో ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సేవాభావంతో విద్యార్థుల జీవితాలకు సరైన దిశానిర్దేశం చేస్తూ భావి తరాలను సమర్థులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, మానవ వనరుల వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేదని, ముఖ్యంగా మహిళల అక్షరాస్యత మరింత వెనుకబడి ఉండేదని గుర్తుచేశారు. విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయులు విద్యా రంగాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని అన్నారు.

ఉపాధ్యాయులు, విద్యావంతుల కృషితో దేశం హరిత విప్లవం, శ్వేత విప్లవం, సమాచార సాంకేతిక విప్లవాలను సాధించి ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. సమాజాన్ని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేదని, నేడు విజయనగరం జిల్లాను విద్యా రంగంలో ముందంజలో నిలిపేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తూ అనేక మంది ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.

జిల్లాలో ఈ ఏడాది పదో తరగతిలో సుమారు 92 శాతం ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయుల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ ప్రైవేట్ విద్యాసంస్థలకు తీసిపోవని నిరూపించాయని పేర్కొన్నారు.

ప్రతి పాఠశాల విద్యార్థులకు రెండో ఇల్లులాంటిదని, ఉపాధ్యాయులు తమ జీవితంలో అత్యధిక సమయాన్ని విద్యార్థులతోనే గడుపుతారని కలెక్టర్ అన్నారు. విద్యార్థుల ఆలోచనా విధానం, వ్యక్తిత్వ వికాసంపై ఉపాధ్యాయుల ప్రభావం ఎంతో ఉంటుందని తెలిపారు.

నేటి విద్యార్థులందరూ ఒకే విధమైన ఆసక్తులు, సామర్థ్యాలు కలిగి ఉండరని, ప్రతి విద్యార్థిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించాలని సూచించారు. విద్యార్థులతో నిరంతరం మమేకమై వారి ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా కెరీర్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి మార్గాలను తెలియజేయాలని ఉపాధ్యాయులను కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల అవసరాలు, అభిరుచులను అర్థం చేసుకుని వారిని సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, భావి సమాజాన్ని నిర్మించే మహత్తర బాధ్యత అని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించడంలో గురువుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి భవిష్యత్‌కు సరైన దిశానిర్దేశం చేయాలని కోరారు.

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తని, వారిని విలువలతో కూడిన విద్యతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

జిల్లా విద్యా వ్యవస్థలో పురోగతి

జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, విజయనగరం జిల్లాలో విద్యా రంగం నిరంతరం పురోగతి సాధిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితో జిల్లా విద్యార్థులు విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.

90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 90 మంది ఉపాధ్యాయులను మంత్రి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యా రంగానికి వారు అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు.

అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయులు అమరావతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సత్కారం అందుకోనున్నట్లు తెలిపారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి, గురువు–శిష్య సంబంధం, విద్యా ప్రాముఖ్యతను ప్రతిబింబించే గీతాలు, నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభకు అతిథులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story