Manyam: సరిహద్దుల్లో ఎక్సైజ్ ఉక్కుపాదం 4,200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం!
Manyam: మన్యం జిల్లా సరిహద్దుల్లో ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం. 'నవోదయం-2.0' లో భాగంగా ఒడిశా పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో 4,200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.
Manyam: సరిహద్దుల్లో ఎక్సైజ్ ఉక్కుపాదం 4,200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం!
Manyam: మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నాటుసారా తయారీపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ‘నవోదయం–2.0’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒడిశా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త అంతర్రాష్ట్ర దాడుల్లో 4,200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు.
మంగళగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా సందుబడి, తమలబై గ్రామాల్లో ఉన్న అక్రమ సారా తయారీ స్థావరాలపై రాయగడ పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు చేపట్టారు.
ఈ దాడుల్లో కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, పార్వతీపురం ఈఎస్‌టీఎఫ్ (ESTF), విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ఎ. సంతోష్ మాట్లాడుతూ, “సరిహద్దు గ్రామాలను కేంద్రంగా చేసుకుని అక్రమ సారా తయారీ, నిల్వ, రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా ఇలాంటి అంతర్రాష్ట్ర దాడులు నిరంతరం కొనసాగుతాయి” అని హెచ్చరించారు.
అక్రమ మద్యం నిర్మూలన లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ చేపడుతున్న ఈ చర్యలు సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేయడంలో కీలకంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు.




