Kurupam: 'బర్త్ వెయిటింగ్ హోమ్' ప్రారంభం – గిరిజన గర్భిణులకు రక్షణ!

Kurupam: మొండెంఖల్లు PHC పరిధిలో రూ.35 లక్షలతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ హోమ్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి.

V.SESHU	, KURUPAM
Published on: 9 Aug 2026 1:13 PM IST
Kurupam
X

Kurupam: 'బర్త్ వెయిటింగ్ హోమ్' ప్రారంభం – గిరిజన గర్భిణులకు రక్షణ!

Kurupam: గిరిజన, కొండప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించి, సురక్షిత ప్రసవాలు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కురుపాం శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ శ్రీమతి తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గ పరిధిలోని మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో నేషనల్ హెల్త్ మిషన్ మరియు ఐటీడీఏ పార్వతీపురం సమన్వయంతో రూ. 35.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన "బర్త్ వెయిటింగ్ హోమ్" భవనాన్ని శనివారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రారంభించారు.

సురక్షిత కాన్పులకు 'బర్త్ వెయిటింగ్ హోమ్' దోహదం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల నుండి వర్షాకాలంలో లేదా రవాణా సౌకర్యం లేని సమయాల్లో కాన్పుల కోసం ఆసుపత్రులకు రావడం గర్భిణులకు సవాలుగా మారుతోందన్నారు. కాన్పు తేదీకి వారం లేదా పది రోజుల ముందే గర్భవతులను ఈ వెయిటింగ్ హోమ్‌కు రప్పించి, ఇక్కడే ఉచిత వసతి, పోషకాహారం, నిరంతర వైద్య పర్యవేక్షణ అందించడం ద్వారా మాతృ, శిశు మరణాలను పూర్తిగా అరికట్టవచ్చని తెలిపారు.

అందుబాటులో నిరంతర వైద్య పర్యవేక్షణ

జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మంజూరైన రూ. 35 లక్షల వ్యయంతో అన్ని వసతులతో ఈ భవనాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న గర్భిణులను గుర్తించి కాన్పు తేదీకి ముందే ఈ బర్త్ వెయిటింగ్ హోమ్‌లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేంద్రంలో గర్భిణులకు కావాల్సిన బెడ్లు, పరిశుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు అంబులెన్స్ సదుపాయం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్,కోలా రంజిత్ కుమార్, కెవి కొండయ్య,ఐటీడీఏ ఏపీఓ పి.మురళీధర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story