Vizianagaram: 45 రోజుల D2D కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కిమిడి కళా!
Vizianagaram: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో 45 రోజుల డోర్ టు డోర్ (D2D) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ప్రారంభించారు.
Vizianagaram: 45 రోజుల D2D కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కిమిడి కళా!
విజయనగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 45 రోజుల డోర్ టు డోర్ (D2D) ప్రచార కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన చర్యలను ప్రతి కుటుంబానికి నేరుగా వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల సమస్యలను ఇంటి వద్దకే వెళ్లి తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం కూడా ఈ కార్యక్రమంలో కీలక భాగమని పేర్కొన్నారు.
ప్రతి బూత్ పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రోజుకు గరిష్టంగా 30 ఇళ్లను సందర్శిస్తూ, ప్రత్యేక యాప్ ద్వారా ఓటీపీ లేదా ఫోటో అప్లోడ్ విధానంలో ప్రచార వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ప్రజలతో మరింత ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించిన సంక్షేమ పాలనకు కొనసాగింపుగా కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ను రూ.200 నుంచి రూ.4,000కు పెంచి అందిస్తోందని తెలిపారు. అలాగే 'తల్లికి వందనం', మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోందన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని, దీని ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
అదేవిధంగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్' అమలుకు ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని, ఇందుకోసం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.
డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి సమస్యను నమోదు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చూడాలని, గ్రామస్థాయిలో ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు శ్రీ కిమిడి కళా వెంకట్రావు సూచించారు.
ప్రజల విశ్వాసమే కూటమి ప్రభుత్వ బలం అని, అభివృద్ధి – సంక్షేమం – ఉపాధి అనే మూడు ప్రధాన స్తంభాలపై రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.




