Kurupam: రావాడ జంక్షన్ వద్ద కురుపాంలో ఘనంగా స్వాతంత్ర్య ముందస్తు వేడుకలు
Kurupam: మన్యం జిల్లా కురుపాంలో 250 అడుగుల భారీ జాతీయ జెండాతో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ. కలెక్టర్ ప్రభాకర రెడ్డి, విప్ తోయక జగదీశ్వరి వేడుకల్లో పాల్గొన్నారు.
Kurupam: రావాడ జంక్షన్ వద్ద కురుపాంలో ఘనంగా స్వాతంత్ర్య ముందస్తు వేడుకలు
Kurupam: దేశ వ్యాప్తంగా జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు 'వందేమాతరం' గీతం 150 ఏళ్లు పూర్తిచేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 'హర్ ఘర్ తిరంగ' ర్యాలీ అత్యంత వైభవంగా సాగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. కురుపాం మండలం రావాడ జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన ఈ భారీ ప్రదర్శనలో 250 అడుగుల సుదీర్ఘ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు త్రివర్ణ పతాకాలను చేతబూని "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" నినాదాలతో పరిసరాలను మార్మోగించారు. కలెక్టర్ మరియు ప్రభుత్వ విప్ స్వయంగా సైకిళ్లపై మరియు పాదయాత్రగా సాగుతూ పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని నింపారు.
ర్యాలీ ముగింపు స్థానమైన తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక 'హర్ ఘర్ తిరంగ' సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మరియు ఇతర అధికారులు ఫోటోలు దిగి సందడి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడానికి, జాతీయ సమైక్యతను చాటడానికి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




