Gummalaxmipuram: గుమ్మలక్ష్మీపురంలో వరుస చోరీలు.. భయాందోళనలో ప్రజలు
Gummalaxmipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం సుందరయ్య కాలనీలో అర్ధరాత్రి మూడు ఇళ్లలో చోరీలు. నగదు, వెండి వస్తువులు అపహరణ.
Serial Thefts In Three Houses, Panic
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి మూడు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి నగదు, వెండి వస్తువులను అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తుతెలియని దుండగులు ఇళ్లలోకి చొరబడి బీరువాలను ధ్వంసం చేసి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నిమ్మక కృష్ణ ఇంటి నుంచి సుమారు రూ.40 వేల నగదు, చిన్నారావు ఇంటి నుంచి 10 తులాల వెండి పట్టీలు అపహరించినట్లు బాధితులు వెల్లడించారు. మరో ఇంటిలో కూడా చోరీ జరిగినట్లు సమాచారం.
ఒకే ప్రాంతంలో వరుసగా మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో సుందరయ్య కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సమాచారం




