Parvathipuram: గంజాయి రవాణా, డ్రగ్స్‌పై ఉక్కుపాదం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో COTPA చట్టం పటిష్ట అమలుకు కలెక్టర్ ఆదేశాలు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 23 July 2026 1:22 PM IST
Parvathipuram
X

Parvathipuram: గంజాయి రవాణా, డ్రగ్స్‌పై ఉక్కుపాదం!

Parvathipuram: జిల్లాలో కోట్పా (COTPA) చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాల రవాణాను చాలావరకు నియంత్రించగలిగామని అన్నారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో నివారణకు సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన N-CORD (నార్కోటిక్స్ కోఆర్డినేషన్) సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులు, బ్లాక్‌స్పాట్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద నిఘాను మరింత తీవ్రతరం చేయాలని అధికారులను ఆదేశించారు.నార్కోటిక్స్ నివారణతో పాటు జిల్లాలో కోట్పా చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రాంగణాల పరిసరాల్లో పొగాకు, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీ దుఖాణాలు , పెటీ షాపుల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తూ, సీరియస్‌గా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

పోలీస్ డ్రైవ్‌లలో కేవలం పోలీసులే కాకుండా, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు కార్యదర్శులను కూడా భాగస్వాములను చేసి వారికి అవసరమైన శిక్షణ, బాధ్యతలను అప్పగించాలని సూచించారు. ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఆపరేషన్ గరుడ, డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు.

బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రహదారి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. పోలీస్, ఆర్‌అండ్‌బి అధికారులు ఇటువంటి ప్రదేశాలను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకరమైన ప్రదేశమని సూచించే రేడియం బోర్డులు, కేట్ ఐస్, బ్లింకర్ లైట్లు అమర్చడం, మలుపుల వద్ద డివైడర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, పోలీసుల నిరంతర గస్తీ తనిఖీలు చేపట్టడం వంటివి చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story