Gummalaxmipuram: ఆత్మవిశ్వాసంతో చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలి కలెక్టర్
Gummalaxmipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.
Gummalaxmipuram: ఆత్మవిశ్వాసంతో చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలి కలెక్టర్
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 7: బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలపై ఆసక్తిగా తెలుసుకున్నారు.
పాఠశాలలో అందుతున్న విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాలు, మౌలిక వసతులపై ప్రిన్సిపాల్ రంజని నుంచి వివరాలు తెలుసుకున్న కలెక్టర్, విద్యార్థినులు ఎలాంటి భయాలు, సంకోచాలు లేకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.
విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్న కలెక్టర్, మలేరియా వంటి వ్యాధుల నివారణకు పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ఉపాధ్యాయులు, సిబ్బందికి సమాచారం అందించి వైద్య సేవలు పొందాలని సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బాలికల విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేసిన కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కేజీబీవీ పాఠశాలగా అవార్డు అందుకున్నందుకు ప్రిన్సిపాల్ రంజని, ఉపాధ్యాయులు, సిబ్బందిని అభినందించారు.
జిల్లా కలెక్టర్ సందర్శనతో విద్యార్థినుల్లో ఉత్సాహం నెలకొనగా, వారి సమస్యలు, అవసరాలను స్వయంగా తెలుసుకుని సూచనలు ఇవ్వడం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.




