Parvathipuram: 18 నాటికి ADP, ABP పనులు పూర్తికావాలి.. జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

Parvathipuram: పార్వతీపురం జిల్లాలో నీతి ఆయోగ్ ADP, ABP పనులను ఈ నెల 18లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాలు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 11 Jun 2026 5:17 PM IST
Parvathipuram
X

Parvathipuram: 18 నాటికి ADP, ABP పనులు పూర్తికావాలి.. జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

పార్వతీపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి ఆయోగ్ 'ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ (ADP), 'ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్'(ABP) కింద జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులన్నీ ఈ నెల 18లోగా పూర్తికావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనుల స్థితిగతులను, సాధించిన ప్రగతిని ఆయన శాఖల వారీ ఆరా తీసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 10 పాఠశాలల్లో స్మార్ట్ ఐసీటీ ల్యాబ్‌ల ఏర్పాటు పనులు వేగవంతం కావాలని, 8 పాఠశాలల్లో జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఈ నెల 18 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.

పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోగా ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని, అలాగే నీటి వనరులను గుర్తించి కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పనులను నిర్దేశిత గడువులోగా, ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని లేదా నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని, సాగునీటి పనుల కోసం తగిన నోట్ ఫైల్‌ను సిద్ధం చేసి తమ ఆమోదానికి సమర్పించాలని ఆదేశించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story