Bobbili: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు.. సీబీఐ విచారణకు శంబంగి డిమాండ్!

Bobbili: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 14 Aug 2026 5:57 PM IST
Bobbili
X

Bobbili: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు.. సీబీఐ విచారణకు శంబంగి డిమాండ్!

Bobbili: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే కొంతమందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని ఆయన ఆరోపించారు.

దీనివల్ల మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఇదిలా ఉండగా, బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బొబ్బిలికి వచ్చి వెళ్లారని, అయితే ఆసుపత్రి అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆయన అన్నారు. మంత్రి పర్యటనతో ఆసుపత్రికి నిధులు వస్తాయని ప్రజలు ఆశించినప్పటికీ, ఆ దిశగా ఎలాంటి ప్రకటన లేకపోవడం బాధాకరమన్నారు. కేవలం వచ్చి వెళ్లడంతో సమస్యలు పరిష్కారం కావని, ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వైద్య పరికరాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని శంబంగి కోరారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్షానికి తగిన గుర్తింపు ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరమని శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేర్కొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story