Bhogapuram: ఉత్తరాంధ్ర మణిహారం ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!
Bhogapuram: ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. సమీక్షించిన సీఎం చంద్రబాబు; భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం.
Bhogapuram: ఉత్తరాంధ్ర మణిహారం ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!
Bhogapuram: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపించే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయం ప్రారంభం కానుండగా, ఈ కార్యక్రమాన్ని చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎం.. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలవడమే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు..
విమానాశ్రయం ప్రారంభంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీ వంటి కీలక ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో భోగాపురం కేవలం విమానాశ్రయానికే పరిమితం కాకుండా, విద్య, నైపుణ్యాభివృద్ధి, విమానయాన రంగాల్లో సమగ్ర అభివృద్ధికి కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.
భవిష్యత్తులో ఏవియేషన్ రంగానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దే హబ్‌గా ఈ ప్రాంతం ఎదిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఉత్తరాంధ్ర ప్రజల పండుగగా నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి థింసా, సవర, కొమ్ము కోయ వంటి ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలకాలని సూచించారు. ఈ వేడుక ద్వారా ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వారి సేవలను గుర్తిస్తూ ఒక్కో రైతుకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించే ప్రతిపాదనను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది ప్రభుత్వ కృతజ్ఞతకు ప్రతీకగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్, పటిష్ట భద్రత, తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, జీఎంఆర్ సంస్థ సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
జూలై 21 నుంచి 31 వరకు ఉత్తరాంధ్ర అంతటా విమానాశ్రయం ప్రారంభోత్సవంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం గురించి చేరేలా ప్రత్యేక ప్రచార ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అంతేకాదు, ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపై ప్రోత్సహిస్తున్న అరకు కాఫీ బ్రాండింగ్‌ను కూడా ఈ వేదికపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రకు దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. పర్యాటకం, ఐటీ, పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఎగుమతులు, ఉపాధి అవకాశాలకు ఇది కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విశాఖపట్నం మహానగర అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, ఉత్తరాంధ్రను పెట్టుబడులకు ఆకర్షించే ప్రధాన కేంద్రంగా భోగాపురం నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్ర అభివృద్ధి పటంలో భోగాపురం మరో కీలక మైలురాయిగా నిలవనుంది.




