Kurupam: ఆదివాసీల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్!

Kurupam: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. గిరిజనుల విద్యా, వైద్య, ఆర్థిక రంగాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

V.SESHU	, KURUPAM
Published on: 9 Aug 2026 7:03 PM IST
Kurupam
X

Kurupam: ఆదివాసీల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్!

కురుపాం, ఆగష్టు 9 : ఆదివాసీ ప్రాంతాల సమగ్ర వికాసానికి, గిరిజనుల విద్యా, వైద్య, ఆర్థిక రంగాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. గిరిజనులు ఈ సంక్షేమ ఫలాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఆదివాసీల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని వెల్లడించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కురుపాం మండలం, జి.శివడ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ పలు కీలక సూచనలు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.95 లక్షల మందికి మలేరియా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు .గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ మలేరియా నివారణ మందులు, అవసరమైన వైద్య సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉంచామని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

ఏ పిల్లవాడికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆందోళన చెందకుండా హాస్టల్/పాఠశాల లేదా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని, అప్పుడే వారికి మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. పిల్లలకు స్వల్ప అనారోగ్యం కలగగానే ఇతరుల మాటలు విని వెంటనే ఇళ్లకు తీసుకువెళ్లవద్దని తల్లిదండ్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఇంటికి తీసుకెళ్తే అక్కడ వైద్య సదుపాయాలు ఉండవని, పాఠశాలలు, హాస్టళ్ల వద్ద ఏఎన్ఎమ్ లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి పిల్లల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మరియు పెద్ద సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story