Visakhapatnam: కూటమి పాలనపై విరుచుకుపడ్డ వైఎస్సార్‌సీపీ నేత బీఎస్ కృష్ణ
Visakhapatnam: విశాఖలో సహజ వనరుల దోపిడీ, గురుకుల పాఠశాల తరలింపు, తాగునీటి ఎద్దడి, ధరల పెరుగుదలపై కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ నేత బీఎస్ కృష్ణ నిలదీశారు.
Visakhapatnam: కూటమి పాలనపై విరుచుకుపడ్డ వైఎస్సార్‌సీపీ నేత బీఎస్ కృష్ణ
విశాఖపట్నం: విశాఖపట్నం మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని చెబుతున్న కూటమి ప్రభుత్వం, వాస్తవానికి ప్రజా సంక్షేమంపై కాకుండా విశాఖ జిల్లాలోని సహజసిద్ధమైన వనరులను కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టిందని బి.ఎస్. కృష్ణ ఆరోపించారు.
కొండలు, మట్టి, సహజ వనరుల తరలింపుపై ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కనీసం కన్నెత్తి చూడకపోవడం దురదృష్టకరమన్నారు. “సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం సంపద సృష్టించకుండా, కొంతమంది వ్యక్తులు మరియు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం విశాఖ సహజ సంపదను దోచుకుంటోంది” అని ఆయన విమర్శించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండలు, మట్టి తదితర సహజ వనరుల తరలింపు జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా అధికార పార్టీ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాల తరలింపు అంశంపై బి.ఎస్. కృష్ణ తీవ్రంగా స్పందించారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలను ఉన్నట్టుండి ఎందుకు తరలించాల్సి వచ్చిందో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇలాంటి కీలక నిర్ణయాలను ప్రజలకు తెలియకుండా తీసుకోవడం అన్యాయమన్నారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, తరలింపు తర్వాత విద్యార్థుల పరిస్థితి, వారికి కల్పించబోయే సౌకర్యాలపై ప్రభుత్వం పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. “గురుకుల పాఠశాల తరలింపు వెనుక అసలు కారణం ఏమిటి? అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు.విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గురుకుల పాఠశాలను అదే ప్రదేశంలో కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బి.ఎస్. కృష్ణ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా సదుపాయాలను బలోపేతం చేయాల్సిన సమయంలో ఉన్న విద్యా సంస్థలను తరలించడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన సోదరులు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుంటే పోలీసుల ద్వారా అడ్డుకోవడం, నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు. “ప్రభుత్వ నిర్ణయం సరైనదైతే ప్రజలు ప్రశ్నించకుండా పోలీసు బలగాలతో ఎందుకు అడ్డుకుంటున్నారు? అవినీతి లేకపోతే, అక్రమం లేకపోతే ప్రజా ఉద్యమాలను ఎందుకు భయపడుతున్నారు?” అని బి.ఎస్. కృష్ణ నిలదీశారు. విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి గ్రేటర్ విశాఖలో లక్షలాది మంది ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని బి.ఎస్. కృష్ణ తెలిపారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న సమయంలో ప్రజలకు సరిపడా నాణ్యమైన తాగునీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విశాఖ నగరానికి నీటి సరఫరా, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులు, ప్రజలకు అందుతున్న నీటి పరిమాణంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విశాఖ నీటి సమస్యపై చర్చించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రజలకు తాగునీరు మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారంగా మారాయని బి.ఎస్. కృష్ణ అన్నారు. సామాన్య ప్రజలు రోజువారీ జీవనం సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతు బజార్లలో సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించాలని కోరారు.
విశాఖ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం కఠినమైన పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని బి.ఎస్. కృష్ణ అన్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, ఆ కమిటీల నివేదికలను ప్రజలకు వెల్లడించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలు, భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, గిరిజనులు, రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తే వారిని అరెస్టు చేయడం, నిర్బంధించడం, కేసులు పెట్టడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని బి.ఎస్. కృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. “అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసం ఉపయోగించాలి. ప్రజల హక్కులను కాలరాస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారు” అని ఆయన అన్నారు.
అభివృద్ధి పేరుతో ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని బి.ఎస్. కృష్ణ అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావడం అవసరమే అయినప్పటికీ, వాటి పేరుతో స్థానిక ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ప్రభుత్వం అనుసరించకూడదన్నారు. ప్రజల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు, గిరిజనుల హక్కులు, తాగునీరు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి అంశాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని బి.ఎస్. కృష్ణ స్పష్టం చేశారు. గురుకుల పాఠశాల తరలింపును తక్షణమే నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలని, నీటి సమస్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సహజ వనరుల తరలింపుపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, ప్రశ్నించే ప్రతిపక్షాలను అణచివేస్తూ, పోలీసు బలగాలతో పరిపాలన కొనసాగించడం ఎక్కువ కాలం సాధ్యం కాదు. ప్రజల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, గిరిజనుల హక్కుల కోసం, విశాఖ ప్రజల కనీస అవసరాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. అవసరమైతే దీక్షలు, నిరసనలు, ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం” అని బి.ఎస్. కృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలను పునఃసమీక్షించి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, విశాఖ జిల్లాలోని ప్రజా సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.




