Visakhapatnam: అధికారుల నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ పోరుబాట: కేకే రాజు!
Visakhapatnam: విశాఖలో తాగునీటి ఎద్దడి, కేజీహెచ్‌లో మందుల కొరత, భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు.
Visakhapatnam: అధికారుల నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ పోరుబాట: కేకే రాజు!
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో నెలకొన్న వివిధ ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కె.కె. రాజు మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తున్నప్పటికీ, విశాఖ నగర పరిధిలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నగర ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగంతో పాటు జీవీఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి..
విశాఖపట్నం నగరంలో గత కొన్ని నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కె.కె. రాజు అన్నారు. నగర ప్రజల దాహాన్ని తీర్చలేని పరిస్థితి ఏర్పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రతి సంవత్సరం వర్షపాతం, నీటి లభ్యత తదితర అంశాలను ముందుగానే అంచనా వేసుకుని తాగునీటి భద్రత కోసం ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ప్రస్తుతం అలాంటి ముందస్తు ప్రణాళిక కనిపించడం లేదన్నారు.
నగరంలోని అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్లలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్‌లో నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యం కాని ప్రాంతాల్లో జీవీఎంసీ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరు అందించాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్థానికులు చందాలు వేసుకుని ట్యాంకర్ల కోసం ఫోన్‌పే ద్వారా చెల్లించాల్సి వస్తోందని ఆరోపించారు.
తాటిపూడి జలాశయం నుంచి విశాఖ నగరానికి వచ్చే నీటి పైపులైన్లతో పాటు రిజర్వాయర్లు, ఇతర నీటి సరఫరా వ్యవస్థల్లో లీకేజీలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.విశాఖ నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజలకు నిరంతర, సురక్షితమైన మంచినీటి సరఫరా కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
కేజీహెచ్‌లో మందుల కొరతపై చర్యలు తీసుకోవాలి..
ప్రజారోగ్యానికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయని కె.కె. రాజు అన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేజీహెచ్‌ను అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్యం, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేజీహెచ్‌లో వైద్యులు, సర్జన్లు ఉన్నప్పటికీ అవసరమైన మందులు అందుబాటులో లేవని కొంతమంది రోగులకు చెబుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
మందులు లేవని చెప్పి రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రే ప్రధాన ఆధారం అని, కేజీహెచ్‌లోనే అవసరమైన అన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ సరఫరా, మందులు, ఇంజెక్షన్ల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, వీటిపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీసుకురావాలని కోరారు.
పోర్టు కాలుష్యంపై ప్రజాప్రతినిధులు స్పందించాలి..
విశాఖ నగరంలో పోర్టు కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కె.కె. రాజు అన్నారు. దశాబ్దాలుగా పోర్టు పరిసర ప్రాంతాల్లో కాలుష్య నివారణ కోసం పోర్టు అథారిటీ నుంచి సీఎస్‌ఆర్ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఆ నిధులను ప్లాంటేషన్, తాగునీరు, వైద్య శిబిరాలు తదితర ప్రజా అవసరాలకు వినియోగించాల్సి ఉన్నప్పటికీ, గత 26 నెలలుగా పోర్టు పరిధిలో ప్రజల కోసం గతంలో మాదిరిగా తగిన స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించారా అని ప్రశ్నించారు.
ప్రజల ఓట్లతో ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పోర్టు కాలుష్యంపై కనీసం సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పోర్టు కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కప్పరాడ సర్వే నంబర్ 13లో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..
కప్పరాడ సర్వే నంబర్ 13లో సుమారు మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని కె.కె. రాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమిని ఆక్రమించి షెడ్లు నిర్మించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై గతంలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, గత పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఆధారాలను కూడా అందించామని అన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్‌పై ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోతే జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారుల తీరుపై ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విశాఖ నగర ప్రజలు ప్రాథమిక సౌకర్యాల కోసం అష్టకష్టాలు పడుతున్నారని, తాగునీరు, వైద్యం, కాలుష్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి కీలక అంశాలపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని కె.కె. రాజు డిమాండ్ చేశారు.
జీవో నెం. 296 ప్రకారం పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలి..
గత 10, 20, 30 సంవత్సరాలుగా చిన్న చిన్న ఇళ్లలో నివసిస్తూ, అనంతరం తమ స్థలాల్లో పక్కా ఇళ్లు నిర్మించుకున్న పేదలకు జీవో నెం. 296 ప్రకారం ఇళ్లను, స్థలాలను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని కె.కె. రాజు తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా పలువురు ప్రజల నుంచి డబ్బులు కూడా వసూలు చేసి, రీ-కన్వేయన్స్ డీడ్స్ తదితర ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత పత్రాలను అందించకపోవడం దారుణమన్నారు. ప్రజలు చట్టబద్ధంగా చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించిన తర్వాత కూడా పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. జీవో నెం. 296కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి..
అగనంపూడి ప్రాంతంలో ఇటీవల జరిగిన అనుమానాస్పద మృతిపై కూడా కె.కె. రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
గతంలో నగరంలో ఏదైనా నేర ఘటన జరిగినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేసేవారని, ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితి ఉందని విమర్శించారు. సామాన్య ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని, అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జీవీఎంసీలో అధికారుల మార్పులతో అభివృద్ధి కుంటుపడుతోంది..
విశాఖ నగర అభివృద్ధికి సంబంధించి జీవీఎంసీ పనితీరుపై కూడా కె.కె. రాజు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ కాలంలోనే పలువురు జీవీఎంసీ కమిషనర్లు మారడం వల్ల నగర సమస్యలపై అధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఏర్పడే పరిస్థితి లేదన్నారు.
రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన సామాన్య ప్రజలకు నిబంధనల ప్రకారం రావాల్సిన పరిహారం, టిడీఆర్ తదితర ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి పారదర్శకమైన పాలన అందించాలని డిమాండ్ చేశారు.
గురుకుల విద్యార్థుల సమస్యలపై తక్షణ చర్యలు..
నగరంలో ముఖ్యంగా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల విషయంలో జరిగిన పరిణామాలను ఆయన తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి సమయంలో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి ఖాళీ చేయించడం, తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదన్నారు.
ఈ ఘటనపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పార్టీ నాయకులు ఇప్పటికే ఆందోళనలు చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి ముందు గిరిజనులను నిర్బంధించడం లేదా వారి నిరసనలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కె.కె. రాజు అన్నారు.
అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి..
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని కె.కె. రాజు స్పష్టం చేశారు. “ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల ఆస్తులు, హక్కులు, సమస్యలకు రక్షణగా నిలవాలి. అధికార పార్టీ నాయకుల కింద పనిచేసే బానిసలుగా అధికారులు మారకూడదు. ప్రజల సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలి” అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైతే ప్రజల తరఫున మరింత బలంగా పోరాటం చేస్తామని కె.కె. రాజు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ నాయకులు కొట్టుమూరు సతీష్, బాణాల సత్య శ్రీనివాసరావు, పేడాడ రమణకుమారి సతీష్ వర్మ, సేనాపతి అప్పారావు, అనిల్ కుమార్ రాజు, అల్లు శంకర్రావు, కొండా రాజీవ్ గాంధి , మంచా నాగమల్లేశ్వరి, పేర్ల విజయ్ చందర్ , జీలకర్ర నాగేంద్ర, అంబటి శైలేష్మ, ఎం సునీల్, శ్రీదేవి వర్మ , గొండబ మనోజ్ , దేవరకుడా మార్కండేయులు, పిలా ప్రేమ్ కుమార్ , శివరామకృష్ణ, సనపల రవీంద్ర భారత్, సంతోష్, నీల రవి, ఈశ్వరరావు , పరదేశి, ఈశ్వరి, చోల్లిగి నాగేశ్వరరావు , బొద్దేటి కిరణ్ , బి సెట్టి ప్రసాద్ , ధర్మాల శ్రీనివాసరావు, బోగువెల్లి గోవింద్, గాలి ప్రసాద్, ప్రదీప్, మువ్వల సంతోష్ , హరికృష్ణ , మహేష్, సూర్య, అనిల్ శర్మ, మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




