Visakhapatnam: విశాఖ ఉక్కు భూముల వేలం.. 19.29 ఎకరాల విక్రయానికి సిద్దం!

Visakhapatnam: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి ఎన్ఎల్ఎంసీ ఈ-వేలం ప్రకటన.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 1 Sept 2026 11:33 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ ఉక్కు భూముల వేలం.. 19.29 ఎకరాల విక్రయానికి సిద్దం!

Visakhapatnam: స్టీల్ ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఎఎన్ఎల్) భూములను మళ్లీ వేలం వేస్తున్నారు. ఇప్పుడు 19.29 ఎకరాల విక్రయం ద్వారా రూ.900 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం హెచ్బీ కాలనీలో స్టీల్ ప్లాంటు ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్లను ఐదేళ్ల క్రితం నిరర్ధక ఆస్తుల పేరుతో కూలగొట్టి అక్కడ అందుబాటులో ఉన్న 22.19 ఎకరాలను విక్రయించే ప్రయత్నం చేశారు.

ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బీసీసీఎల్) తో ఒప్పందం చేసుకున్నారు.

సీతమ్మధారను ఆనుకుని ఉన్న హెచ్బీ కాలనీలో 22.19 ఎకరాల విస్తీర్ణంలో 35 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంటు ఉద్యోగుల కోసం 830 క్వార్టర్లు నిర్మించారు. ఇవి ప్లాంటుకు 15 కి.మీ. దూరాన ఉండడంతో వాటిలో నివాసానికి అప్పట్లో ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో ప్లాంటును ఆనుకొని నాలుగు వేల ఎకరాల్లో టౌన్షిప్ నిర్మించారు. దాదాపు 90 శాతం ఉద్యోగులు అక్కడే ఉంటున్నారు.

సరైన నిర్వహణ లేక హెచ్బీ కాలనీ క్వార్టర్లు శిథిలమైపోయాయి. వాటిలో సుమారు వంద క్వార్టర్లకు ఆరేళ్ల క్రితం మరమ్మతులు చేసి కింది స్థాయి కార్మికులకు ఇచ్చారు. అవి కూడా శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది.

గజం రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షలు పలుకుతోంది. ఇంతకు ముందు కూడా ఈ-వేలం ద్వారానే హెచ్బీ కాలనీలో కొన్ని ప్లాట్లు విక్రయించారు. వాటి ద్వారా రూ.150 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.

ఇప్పుడు ఎన్ఎల్ఎంసీ ద్వారా

స్టీల్ ప్లాంటు యాజమాన్యం హెచ్బీ కాలనీతో పాటు ఆటోనగర్, విశాఖపట్నం బయట హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉన్న భూములను కూడా విక్రయానికి పెట్టింది. దానిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై స్టే విధించడంతో కొన్నాళ్లు వేలం

ఆగిపోయింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ వల్ల నిరుపయోగంగా ఉన్న భూముల ద్వారా ఆదాయం వచ్చేలా చేయడానికి 'నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్' (ఎన్ఎల్ఎంసీ)ని 2022లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు స్టీల్ ప్లాంటు భూముల ఈ-వేలం బాధ్యతలు ఆ సంస్థకు అప్పగించారు.

హెచ్బీ కాలనీలతో 456 ప్లాట్లు (సుమారుగా 18.17 ఎకరాలు), ఆటోనగర్ లో బ్లాక్ 2, 3లలో మూడు ప్లాట్లు (0.56 ఎకరాలు చొప్పున) మొత్తం 19.29 ఎకరాలు వేలం వేసి రూ.900 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎన్ఎల్ఎంసీ 'ఎక్స్'లో ప్రకటించింది. అయితే ప్లాట్ల విస్తీర్ణాలు, వాటి నామమాత్రపు ధరలు ఏవీ అందుబాటులో ఉంచలేదు.

విశాఖలో ప్రస్తుతం భూముల ధరలు అధికంగా ఉన్నాయి. హెచ్బీ కాలనీ ప్రధాన రహదారిని ఆనుకొనే ఉంది. జాతీయ రహదారి (ఎన్హెచ్-16కి)కి దగ్గరగాను ఉంది. భూగర్భ నీటి సమస్య లేదు. చదరపు గజం రూ.2 లక్షలు చొప్పున అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 18 ఎకరాలకు సుమారు రూ.1,700 కోట్ల వరకు ఆదాయం వస్తుందని స్టీల్ ప్లాంటు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ దిశగా ఎన్ఎల్ఎంసీ దృష్టి సారించాల్సి ఉంది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story