Visakhapatnam: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం!

Visakhapatnam: విశాఖ ఉక్కు నగరంలో సీఐటీయూ స్టీల్ వర్కింగ్ కమిటీ సమావేశం. ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల తొలగింపుపై తపన్ సేన్, సీహెచ్ నర్సింగరావు సమరశీల పోరాట పిలుపు.

SHIVA, BHIMILI
Published on: 26 Aug 2026 4:26 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం!

Visakhapatnam: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, స్టీల్ యాజమాన్యం కార్మిక హక్కులను తొలగింపుకు వ్యతిరేకంగా సమరశీలంగా ఉద్యమిద్దమని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు తపన్ సేన్ పిలుపునిచ్చారు. నేడు ఉక్కు నగరంలోని సిఐటియు కార్యాలయంలో స్టీల్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తపన్ సేన్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి కీలకమైనది స్టీల్ రంగం అది ప్రైవేటు వారి ఆధీనంలో ఉంటే అభివృద్ధి ప్రశ్నార్ధకం అవుతుందని ఆయన అన్నారు. అందులో ప్రధానంగా ఎగుమతులకు దిగుమతులకు అనువైన విశాఖ ఉక్కును ప్రైవేటు వారి ఆధీనంలో ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన వివరించారు.

కనుక దీని రక్షణకు జరిగే పోరాటం దేశభక్తియుతమైనదని ఆయన అన్నారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ అభివృద్ధి కంటే కార్పొరేట్ సేవకే ప్రాధాన్యతను అధికం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తన బలాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తుందని ఆయన అన్నారు. అందులో భాగంగానే కార్మిక హక్కులను యాజమాన్యం ఒకటి ఒకటిగా తొలగిసోంది.

మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం మౌనముద్రను వీడి నియంతృత్వం పై మన గలాన్ని అత్యంత బిగ్గరగా వినిపించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాన్ని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి లలిత్ మిశ్రా మాట్లాడుతూ కార్మికులను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేస్తూ తమంతట తామే నైరాశ్యానికి వచ్చే విధంగా నేడు ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. దీనిలో భాగంగానే లేబర్ కోడ్స్ ద్వారా అనేక చట్టబద్ధమైన హక్కులను తొలగింపుకు యాజమాన్యం వెనుకాడట లేదని ఆయన వివరించారు.

ప్రధానంగా స్టీల్ పరిశ్రమలో ఆధునీకరణ జరిగినప్పటికీ మానవ వనరుల లభ్యత అత్యంత ప్రధానంగా ఉందని ఆయన అన్నారు. శాశ్వత కార్మికుల సంఖ్య తగ్గుదల నేపథ్యంలో ఒప్పంద కార్మికుల సంఖ్య పెరిగింది. వీరి స్థానంలో నేడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఎటువంటి హక్కులు లేని పరిస్థితి మన ముందు ఉన్నాయని ఆయన అన్నారు.

దీని ద్వారా వారికి భద్రత కల్పించడంలోను వైఫల్యం వల్ల, భద్రత లేని పని ప్రదేశాలు, నాసిరకమైన ఉత్పత్తులు వినియోగం వల్ల తమ విలువైన ప్రాణాలను వారు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తక్షణమే నూతన నియామకాలు చేపట్టి కార్మికుల విలువైన ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటాల ద్వారానే ఆవిర్భవించిందని నేటికీ ఆ పోరాటాల ద్వారానే మనుగడ సాగిస్తోందని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బి ఐ ఎఫ్ ఆర్ సమస్యను,నీటి సమస్యను అధిగమించడం ద్వారా విస్తరణ జరిగి నూతన నియామకం జరిగిందని, కె బి ఆర్-2 నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు.

నేటికీ సొంత గనుల సమస్య తో పాటు, 100% వ్యూహాత్మక అమ్మకం పై ఐక్య పోరాటాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఆ పోరాటాన్ని అణిచివేయడానికి యాజమాన్యం నిర్బంధాన్ని, హక్కులపై దాడిని మరింత తీవ్రతరం చేసిందని ఆయన స్పష్టం చేశారు. నేటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నారని వారి మద్దతును తొలగించడం కోసమే నేడు కూటమి ప్రభుత్వం 11400 కోట్ల రూపాయలను ప్యాకేజీ ప్రకటించిందని ఆయన అన్నారు.

దీనిని యంత్రాల మరమ్మతులకు గాని, రా మెటీరియల్ కొనుగోలుకు గాని వినియోగించలేదని కేవలం బ్యాంక్ అప్పులు తీర్చడానికి మాత్రమే వినియోగించారని ఆయన వివరించారు. ఈ విషయంపై నేడు స్టీల్ కార్మికులో గల భ్రమలు తొలగి పోయి కానీ రాష్ట్ర ప్రజలకు గల భ్రమలను తొలగించే విధంగా తమ గళాన్ని విప్పాలని ఆయన సూచించారు. కనుక ఆ విధమైన పోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహానాడు వేదికగా అబద్దాలను ప్రచారం చేసిందని వాస్తవంగా నష్టాలు మరింత పెరిగాయని ఆయన అన్నారు. నేడు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తికి అవసరమైన బాలెన్సింగ్ లేదని ఆయన వివరించారు.

ఇది సరి చేయడానికి కోకో ఓవెన్ బ్యాటరీ-6, రోలింగ్ మిల్స్ నిర్మాణం జరిగి, కోకో ఓవెన్-1 నుంచి 4 బ్యాటరీలు, సెంటర్ ప్లాంట్, ఆర్ ఎం హెచ్ పి లోను మరమ్మత్తులు తక్షణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలను స్టీల్ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఎనిమిది వేల కోట్ల రూపాయలను అందిస్తానని హామీ ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్న ఎటువంటి ప్రక్రియ ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. అలాగే కార్మికులకు బకాయి పడిన 900 కోట్ల రూపాయలను తక్షణం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు రామస్వామి, జె అయోధ్యరామ్ స్టీల్ సిఐటియు నాయకులు కె ఎం శ్రీనివాస్,బి తౌడన్న, పుల్లారావు, బి ఎన్ మధుసూదన్, బి మహేష్, మరిడయ్య, డి ఎస్ వి ఎస్ శ్రీనివాస్, వి ప్రసాద్, ఏ శ్రీనివాస్, భానుమూర్తి, మొహిద్దిన్, లోకేష్, అప్పారావు, మహేష్, రాజా, రాజు, సి హెచ్ వెంకట్రావు, కర్రీ శ్రీనివాస్, పవన్, కె ఆర్ కె రాజు, బొంజు బాబు తో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వి ప్రసాద్

ఉపాధ్యక్షులు

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story