Visakhapatnam: విశాఖలో హోరెత్తిన పవన్ బర్త్‌డే వేడుకలు!
Visakhapatnam: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా విశాఖ దక్షిణంలో భారీ బైక్ ర్యాలీ, రక్తదాన శిబిరం.
Visakhapatnam: విశాఖలో హోరెత్తిన పవన్ బర్త్‌డే వేడుకలు!
Visakhapatnam: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. యువజన విభాగం సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
పూర్ణా మార్కెట్ నుంచి జగదాంబ మీదుగా ఫంక్షన్ హాల్ వరకు సాగిన బైక్ ర్యాలీలో జనసేన యువత, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. ప్రతి జంక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షల పోస్టర్లు, బ్యానర్లతో నగరం పండుగ వాతావరణాన్ని తలపించింది.
అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం, ఉచిత మెడికల్ క్యాంప్, కంటి వైద్య శిబిరాలకు జనసేన పార్టీ శ్రేణులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, రోటరీ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ తదితర సంస్థల సహకారంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా దినోత్సవంగా జరుపుకోవడం జనసేన పార్టీ ప్రత్యేకత అని అన్నారు. రక్తదానం చేసి ప్రాణాలను కాపాడటం, వైద్య సేవలను అందించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని యువత ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని, విశాఖ నగరంలోనూ ప్రతి వార్డు, ప్రతి ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
“జనసేన అంటే జనంలో ఉండే పార్టీ.. ప్రజల కోసం పనిచేసే పార్టీ. పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని ప్రతి కార్యకర్త ఆచరణలో చూపించాలి” అని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




