Thimmapuram: తెలుగు పిలుపుల్లోనే ఆత్మీయత: వెంకయ్య నాయుడు
Thimmapuram: తిమ్మాపురం విజ్ఞాన్ పాఠశాలలో ఆచార్య వెలమల సిమ్మన్న రచించిన 'అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి' పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
Thimmapuram: తెలుగు పిలుపుల్లోనే ఆత్మీయత: వెంకయ్య నాయుడు
విశాఖపట్నం, తిమ్మాపురం: విశాఖ జిల్లా తిమ్మాపురంలో గల విజ్ఞాన్ వన్ వరల్డ్ పాఠశాల వేదికగా “అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ రచయిత, ఆచార్య వెలమల సిమ్మన్న రచించిన 100వ గ్రంథంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని వివరించారు.
ప్రస్తుత తరంలో మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ వంటి పిలుపులు ఎక్కువగా వినిపిస్తున్నాయని పేర్కొన్న వెంకయ్య నాయుడు.. వాటికి బదులుగా మన సంస్కృతి, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే అమ్మ, నాన్న, పిన్ని, అక్క, బావ, అన్న వంటి తెలుగు పిలుపులను ఉపయోగించడం ఎంతో మంచిదని అన్నారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రచయిత ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ.. తన 100వ గ్రంథాన్ని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు నల్లా సత్యనారాయణ, జర్రా అప్పారావు, విజ్ఞాన్ వన్ వరల్డ్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.




