Palakonda: సింగన్న వలస గ్రామంలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పర్యటన
Palakonda: పాలకొండ మండలం సింగన్న వలస గ్రామంలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పర్యటించి రెవెన్యూ సమస్యలు, వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
Palakonda
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలోని సింగన్న వలస గ్రామంలో నిర్వహిస్తున్న “ఒక గ్రామము – ఒక నెల – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సబ్ కలెక్టర్ తెలిపారు. ప్రతి గురువారం అధికారులు గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
అనంతరం గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల నమోదు వివరాలు, మందుల నిల్వలు, అందుబాటుపై డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.




