Anakapalle: కలెక్టర్, ఎమ్మెల్యేకు ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ సిబ్బంది మొర!

Anakapalle: పాలిటెక్నిక్ కళాశాలలో గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు నిలిపివేసిన జీతాలు విడుదల చేయాలని, ఏఐసీటీఈ స్కేల్స్ వర్తింపజేయాలని సిబ్బంది కలెక్టర్, ఎమ్మెల్యే కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Updated on: 3 Aug 2026 9:07 PM IST
Anakapalle
X

Anakapalle: కలెక్టర్, ఎమ్మెల్యేకు ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ సిబ్బంది మొర!

అనకాపల్లి, ఆగస్టు 3: గత 16 ఏళ్లుగా రాజీవ్ గాంధీ ఆర్.ఈ.సి.ఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది జిల్లా కలెక్టర్‌తో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ వినతిపత్రాలను అనకాపల్లి మార్కెట్ యార్డులో అందజేశారు.

సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, 2009లో ఆర్.ఈ.సి.ఎస్ సంస్థ నిధులతో పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, ప్రయోగశాలలు, తరగతి గదుల నిర్మాణం వంటి వ్యయాలను సంస్థ భరించేలా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం 2021లో విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కార్యకలాపాలను ఏపీఈపీడీసీఎల్ స్వాధీనం చేసుకున్నప్పటికీ, కళాశాల నిర్వహణ బాధ్యతను మాత్రం చేపట్టలేదని పేర్కొన్నారు.

దీంతో నిధుల కొరత ఏర్పడి కళాశాల తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని, 2024 సెప్టెంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నట్లు వివరించారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించడంతో పాటు అసెంబ్లీలో కూడా అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం అనంతరం, కళాశాల ఆదాయాన్ని ఏపీఈపీడీసీఎల్‌కు బదిలీ చేసే షరతుతో 2025 అక్టోబర్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రారంభించారని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు రూ.80 లక్షల కళాశాల ఆదాయాన్ని ఏపీఈపీడీసీఎల్ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు.

అయితే, ఇప్పటికీ సర్వీస్ నిబంధనలు, AICTE ప్రమాణాల ప్రకారం ఇవ్వాల్సిన ప్రమోషన్లు, డీఏ పెంపుదల అమలు చేయడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. 2006, 2016 వేతన సవరణలను అమలు చేయకుండా ఇప్పటికీ 1996 వేతనాల ప్రకారమే జీతాలు చెల్లిస్తున్నారని, అదనంగా జీతాన్ని రూ.39,500కే పరిమితం చేశారని ఆరోపించారు.

ఇటీవల ఏపీఈపీడీసీఎల్ అధికారులు జీతాల చెల్లింపులు చట్టబద్ధం కావని పేర్కొంటూ జులై నెల జీతాలను నిలిపివేశారని సిబ్బంది తెలిపారు. దీంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాల సిబ్బందికి తక్షణమే బకాయి జీతాలు చెల్లించడంతో పాటు పూర్తి వేతనాలను AICTE ప్రమాణాల ప్రకారం అమలు చేయాలని, సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రమోషన్లు, డీఏ పెంపుదల కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, విభాగాధిపతులు గణేష్, రమణ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేను కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story