Anakapalli: అనకాపల్లిలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!
Anakapalli: అనకాపల్లిలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.. పర్యావరణ పరిరక్షణపై పిలుపు.
Anakapalli: అనకాపల్లిలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!
Anakapalli: ప్రకృతిని పరిరక్షించుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనకాపల్లి పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో అనకాపల్లి గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ హాజరై, తన చేతుల మీదుగా భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్న గ్రీన్ క్లబ్ సభ్యులను, ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలను హృదయపూర్వకంగా అభినందించారు. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
పర్యావరణాన్ని పరిరక్షించడంలో నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, విపరీతమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అదే సమయంలో పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో అనకాపల్లి ప్రాంతంలో సుమారు 46 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడటం రైతులకు ఆనందకరమైన విషయమన్నారు.
అయితే సాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు శాశ్వత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, అడవులను పెంచడం, ప్రకృతిని పరిరక్షించే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఒకవైపు చెట్లను నరికివేస్తూ.. మరోవైపు మొక్కలు నాటడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయని అన్నారు. ప్రకృతిని ఎంతగా నాశనం చేస్తే దాని ప్రభావం అంతగా మన ఆరోగ్యంపై పడుతుందని హెచ్చరించారు. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్ తరాలను, మనల్ని మనం కాపాడుకోవడమేనని కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు.
అనకాపల్లిని పచ్చని చెట్లతో నిండిన ఆహ్లాదకరమైన పట్టణంగా, ప్రకృతి నిలయంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కనకాపురిని సైతం ప్రకృతి వనంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి ప్రజలు, దాతలు, గ్రీన్ క్లబ్ సభ్యులు సహకరించాలని కోరారు.




