Pedabayalu: అల్లూరి జిల్లాలో అధ్వానంగా మారిన మౌలిక వసతులు!

Pedabayalu: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు వారపు సంతలో వర్షాలకు తీవ్ర బురద, కనీస సౌకర్యాలు లేక విలవిలలాడుతున్న వర్తకులు, గిరిజనులు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 2 Sept 2026 4:49 PM IST
Pedabayalu
X

Pedabayalu: అల్లూరి జిల్లాలో అధ్వానంగా మారిన మౌలిక వసతులు!

Pedabayalu: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు అతి పెద్ద వారపు సంతల్లో ఒకటైన పెదబయలు సంతలో కనీస వసతులు లేక అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సంత ప్రాంగణం బురదమయమై కనీసం నడవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఆశీల రూపంలో పంచాయతీకి లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా సంత అభివృద్ధికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వర్తకులు, వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి సోమవారం జరిగే ఈ సంతకు మండలంలోని 23 పంచాయతీల ప్రజలతో పాటు జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాలు, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు, వర్తకులు తరలి వస్తుంటారు. గిరిజనులు తాము పండించిన పంటలు, అటవీ ఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించడంతో పాటు నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తుంటారు. అనకాపల్లి, నర్సీపట్నం, వడ్డాది, మాడుగులతో పాటు ఒడిశా రాష్ట్రంలోని పాడువా, నందపూర్ నుంచి కూడా వివిధ రకాల సామగ్రితో వర్తకులు సంతకు చేరుకుంటారు. సీజన్లో లక్షల రూపాయల మేర వ్యాపారం జరుగుతుంటుంది.

అయుతే ఇంతటి ప్రాధాన్యం ఉన్న సంతకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వర్షం పడితే సంత ప్రాంగణం మొత్తం చిత్తడిగా మారి మోకాళ్ల లోతు బురద పేరుకుపోతుంది. ముఖ ద్వారాల వద్ద కూడా సరైన రహదారులు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే ఒకదానికొకటి దారి ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇక సంతలో డ్రైనేజీ వ్వవస్థ, సీసీ రోడ్లు లేకపోవడంతో బురదలోనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు పంచాయతీ అధికారులను కోరినా పట్టించుకునే నాఒథుడే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెదబయలు వారపు సంతలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, పారిశుధ్య సదుపాయాలు కల్పించి తమ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని వర్తకులు, వినియోగదారులు కోరుతున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story