Paderu: సకాలంలో రీ-సర్వే పూర్తిచేయాలి జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ!
Paderu: అల్లూరి జిల్లా పాడేరులో రీ-సర్వేను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశం. రేషన్ పంపిణీ పర్యవేక్షణ, ఈ-ఆఫీస్ విధానంపై కీలక సూచనలు.
Paderu: సకాలంలో రీ-సర్వే పూర్తిచేయాలి జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ!
Paderu: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ఆదేశించారు.
బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వారం గ్రామ సభలు నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా పారదర్శకంగా, ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా సేవలు అందించవచ్చన్నారు. రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, ఎటువంటి పొరపాట్లు జరగకుండా మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ప్రతి ఉద్యోగి కార్యాలయ విధులకు సకాలంలో హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ప్రతి మండలంలో గుర్తించి సిద్ధంగా ఉంచాలని, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పాస్ పుస్తకాల పంపిణీకి ముందు అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే సరిచేసిన అనంతరం పంపిణీ చేయాలని సూచించారు.
ఐవీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న ప్రజల ఫీడ్‌బ్యాక్‌లో సంతృప్తి స్థాయిని పెంచే విధంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది మెరుగైన సేవలు అందించాలన్నారు.
మ్యుటేషన్లు, ఆర్‌ఓఆర్ ప్రక్రియలో సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓఆర్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
రేషన్ పంపిణీపై నిరంతర పర్యవేక్షణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేసి, వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. రేషన్ సకాలంలో పంపిణీ చేస్తున్నప్పటికీ ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో సంతృప్తి స్థాయి ఎందుకు తక్కువగా ఉందో గుర్తించి, చౌకధరల దుకాణాల ద్వారా ప్రజల సంతృప్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రేషన్ పంపిణీ, చౌకధరల దుకాణాల్లో స్టాక్ నిల్వలపై ఆర్డీవోలు, మండల రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ-కేవైసీ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి సకాలంలో పూర్తి చేయాలని, గడువు ముగిసిన చౌకధరల దుకాణాల లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.
చౌకధరల దుకాణాలకు దూరంగా ఉండి, రవాణా సదుపాయాలు లేని గ్రామాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో సబ్ డిపోలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యం
కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో నకిలీ ధ్రువీకరణ పత్రాలను గుర్తించడంతో పాటు, దరఖాస్తుల తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా పరిశీలించాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికల ద్వారా వచ్చే భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచవచ్చన్నారు. సంబంధిత అధికారులు సమస్యల మూల కారణాలను గుర్తించి, ప్రజలకు సమర్థవంతమైన పరిష్కారం అందించాలన్నారు.
అన్ని రెవెన్యూ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన పత్రాల నిర్వహణను ఈ-ఆఫీస్ విధానం ద్వారా మాత్రమే చేపట్టాలని ఆదేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులు తిరస్కరణకు గురైన సందర్భాల్లో, ఈ-ఆఫీస్ ద్వారా ఆర్డీవో లాగిన్‌కు పంపించి నిబంధనల ప్రకారం పరిష్కారం పొందాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, పాడేరు ఆర్డీవో ఎం. భుజంగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్, మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




