Paderu: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి
Paderu: పాడేరులో రెవెన్యూ అధికారులతో జేసీ తిరుమాని శ్రీ పూజ సమీక్ష. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పాస్‌పుస్తకాలు, రేషన్ షాపుల తనిఖీపై కీలక ఆదేశాలు.
Paderu: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు రెవెన్యూ అధికార యంత్రాంగం రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే రెవెన్యూ సమస్యలు నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
మండల రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు నిరంతరం ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టడం ద్వారా సమస్యలు త్వరితిగతన పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కార్యాలయం నుండి వచ్చిన, కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వీకరించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కరించుటకు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు.
మండల రెవెన్యూ అధికారులు తమ లాగిన్ లో ఉన్నటువంటి ఫిర్యాదులను ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ వారి లాగిన్ ద్వారా పరిష్కారమయ్యే బాధ్యతను తీసుకోవాలన్నారు. పరిష్కరించబడిన ఫిర్యాదుల ఫిజికల్ కాపీలను భద్రపరచడం ద్వారా మళ్లీ మళ్లీ ఉత్పన్నమయ్యే సమస్యలు పునరావృతం కాకుండా చూడగలుగుతామన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే రేషన్ పై ప్రజల సంతృప్తి స్థాయి పెరిగే విధంగా మండల రెవెన్యూ అధికారులు దుకాణాలను విధిగా సందర్శించాలన్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, పెండింగ్ లో ఉన్న ఈ కేవైసీ, డిజిటల్ సైన్ లను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఏపీ సేవా సర్వీసెస్ ద్వారా జారీ అయ్యే జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ఆలస్యాన్ని నివారించాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో సివిల్ వివాదాలను పరిష్కరించుటకు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి ఫైళ్లను ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే పంపించాలని, విధిగా అన్ని ఫైళ్లను డిజిటలైజేషన్ ద్వారా ఆన్లైన్ నందు పొందుపరచాలన్నారు. గ్రామ సభలు నిర్వహించడం ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలకు అవగాహనా కల్పించడం ద్వారా తప్పులు దొర్లకుండా పారదర్శకంగా సేవలు అందిచగలుగుతామన్నారు. కుల దృవీకరణ పత్రాల మంజూరు లో నకిలీలను గుర్తించాలనీ, మంజూరు చేయనీ పత్రాల విషయంలో కారణాలను గుర్తించాలన్నారు.
ఈ కార్యక్రమములో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎమ్ విఎస్ లోకేశ్వరావు, పాడేరు ఆర్డిఓ ఎం. భుజంగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి వి.మోహన్, సివిల్ సప్లై డిటిలు, ఏ.ఎస్.ఓలు 11 మండల రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహశీల్దార్, మండల్ సర్వేయర్లు,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.




