Anakapalli: సిరసపల్లిలో 21 వేల మొక్కలతో వినూత్న సస్య గణపతి!

Anakapalli: అనకాపల్లి సిరసపల్లిలో 21 వేల మొక్కలతో సస్య గణపతి. గవర్నర్ హరిబాబు రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్పీ తుహిన్ సింహ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 14 Sept 2026 1:43 PM IST
Anakapalli
X

Anakapalli: సిరసపల్లిలో 21 వేల మొక్కలతో వినూత్న సస్య గణపతి!

Anakapalli: అనకాపల్లి జిల్లా సిరసపల్లిలో 21 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన సస్య గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటేలా వినూత్నంగా రూపొందించిన ఈ సస్య గణపతిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివస్తున్నారు.

ఈ క్రమంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం సాయంత్రం 4 గంటలకు సిరసపల్లిలోని సస్య గణపతిని దర్శించుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సింహ సిరసపల్లికి చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, భక్తుల ప్రవేశం తదితర అంశాలను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.

సుమారు 150 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సస్య గణపతి ఉత్సవాలు కొనసాగుతున్న 21 రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పోలీసు సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా ఉత్సవాలకు వచ్చే భక్తులు, ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు.

సస్య గణపతి వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

మొత్తంగా 21 వేల మొక్కలతో రూపుదిద్దుకున్న సస్య గణపతి దర్శనానికి ప్రముఖుల రాకతో సిరసపల్లిలో సందడి నెలకొంది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టమయ్యాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI