Nuzvid: ఐదు రోజుల పని దినం డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల ధర్నా

Nuzvid: ఐదు రోజుల పని దినం కోరుతూ నూజివీడులో ఎస్బీఐ ఎదుట బ్యాంకు ఉద్యోగుల నిరసన. డిమాండ్ నెరవేరకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Sept 2026 10:36 PM IST
Nuzvid
X

Nuzvid: ఐదు రోజుల పని దినం డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల ధర్నా

నూజివీడు: ఐదు రోజుల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా నూజివీడు పట్టణంలో ఎస్బిఐ బ్యాంకు ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఉమ్మడి కృష్ణా జిల్లాల బ్యాంకింగ్ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి అక్కినేని ఆంజనేయ ప్రసాద్ రాజా మాట్లాడారు.

12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో భాగంగా ఐదు రోజుల పని దినానికి బ్యాంకుల యాజమాన్యం అంగీకరించి,2024లోనే కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.ఈ డిమాండ్ సాధన కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు.ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28,29,30 తేదీల్లో మూడు రోజుల సమ్మె, అనంతరం అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

ఐదు రోజుల పని దినం అమలు చేస్తే ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.మొబైల్ బ్యాంకింగ్,ఏటీఎంలు,డిజిటల్ చెల్లింపుల సేవలు అందుబాటులో ఉన్నందున ఖాతాదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.ఐదు రోజుల పని దినం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ అని, కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించి అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్