Vizag: కబ్జాదారులకు జీవీఎంసీ భూములు ఇవ్వడం చట్టవిరుద్ధం
Vizag: విశాఖ నగరానికి తాగునీరు అందించే చారిత్రాత్మక ముడసర్లోవ రిజర్వాయర్ కబ్జాలపై జనసేన నేత పీతల మూర్తి జీవీఎంసీ కమిషనర్ కేతన్ కు వినతిపత్రం అందజేశారు.
Vizag: కబ్జాదారులకు జీవీఎంసీ భూములు ఇవ్వడం చట్టవిరుద్ధం
Vizag: రాష్ట్రమంతటా చెరువుల పరిరక్షణకు జలధార -జల హారతి కార్యక్రమం అమలు జరుగుతున్న వేళ విశాఖ నగరానికి నీరు అందించే ముడసర్లోవ రిజర్వాయర్ కబ్జాలపై చర్యలు తీసుకొని కాపాడాలని జనసేనకి చెందిన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి వనరులను పరిరక్షించే సదుద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జలధార -జల హారతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న సమయం లో విశాఖ నగరానికి అత్యంత కీలకమైన ఈ రిజర్వాయర్ను కాపాడాలని కోరుతూ సోమవారం పీజిఆర్ఎస్ లో విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ కి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో పూడిపోయిన కుంటలు, చెరువులు, నీటి వనరులను లక్షల కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమం కింద పునర్జీవింప చేసే ప్రయత్నం చేస్తున్నారని, అయితే విచిత్రంగా అదే సమయంలో విశాఖ నగరంలో అత్యంత కీలకమైన ముడసర్లోవ రిజర్వాయర్ పెద్ద ఎత్తున ప్రభుత్వ శాఖల ప్రోత్సాహంతోనే కబ్జాలకు గురి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పాటైన ముడసర్లోవ రిజర్వాయర్ నుపరిరక్షించి దానిని మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ,ఆ రిజర్వాయర్లకు వచ్చే జలధారలను పరిరక్షించి రిజర్వాయర్ సామర్థ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
836.38 ఎకరాలను కాపాడాలి
ముడసర్లోవ రిజర్వాయర్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం విశాఖ జిల్లా చినగదిలి మండలం ముడసర్లోవ గ్రామ సర్వే 26 మరియు 27 లో 836.38 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ భూములన్నింటినీ కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ భూములన్నింటినీ కాపాడాల్సిన అవసరం ఉంది. మహావిశాఖ నగరపాలక సంస్థ ఈ రిజర్వాయర్ని నిర్వహిస్తోంది. ఈ రిజర్వాయర్ పరిధిలోని భూములపై నగరపాలక సంస్థకే పూర్తి అధికారాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్ ,రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ప్రాంతాలు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ రిజర్వాయర్ భూములను కాపాడేందుకు మహావిశాఖ నగరపాలక సంస్థ 2025 నవంబర్ 21వ తేదీన కౌన్సిల్ సమావేశంలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. దానిని అమలు జరపాలి అని కోరారు.
ప్రభుత్వ శాఖల కబ్జాలు
ముడసర్లోవ రిజర్వాయర్ పరిధిలోని భూములను జోన్ కార్యాలయం కోసం రైల్వే లకు కేటాయించారని, రిక్రియేషన్ పేరిట, రహదారుల పేరిట, ప్రభుత్వ అవసరాల పేరిట పలు కేటాయింపులు జరిపారని, దీనివల్ల రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కబ్జాదారులకు ప్రత్యామ్నాయం
అయితే ఈ భూముల్లో కొందరు కబ్జాదారులు ఉన్నారంటూ వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని కౌన్సిల్ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. నిబంధనల మేరకు కబ్జాలను తొలగించినప్పుడు పరిహారం రెవెన్యూ విభాగమే ఇవ్వాలి. జీవీఎంసీ భూములను పరిహారంగా ఇవ్వటం చట్ట విరుద్ధం. చట్ట విరుద్ధంగా చేసిన ఆ కౌన్సిల్ తీర్మానాన్ని రద్దుచేసి ముడసర్లోవ రిజర్వాయర్ పరిధిలోని భూములను కబ్జాదారులకు ఇచ్చే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముడసర్లోవ రిజర్వాయర్ కబ్జాదారులకు తిరిగి ముడసర్లోవ రిజర్వాయర్ పరిధిలోనే భూములు ఇవ్వడం అంటే రిజర్వాయర్ను కబళించడమే అవుతుంది అని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.
రహదారి అవతల కబ్జాలు
ముడసరిలోవ రిజర్వాయర్ భూములలో బి ఆర్ టి ఎస్ రహదారిని నిర్మించారు. ఆ రహదారికి మరోవైపు కూడా రిజర్వాయర్ కి సంబంధించిన సుమారు 42 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములను కాపాడాల్సిన బాధ్యత జీవీఎంసీదే. జీవీఎంసీ తో సంబంధం లేకుండా కౌన్సిల్ ఆమోదం లేకుండా పెద్ద ఎత్తున ఆ భూముల్లో ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వాటన్నింటినీ పరిశీలించి ఆ భూముల్లో కబ్జాలను తొలగించి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. రిజర్వాయర్ కి చెందిన కొంత భూమి సింహాచలం దేవస్థానం చేతుల్లో ఉన్నట్లు గత కౌన్సిల్ సమావేశంలో చూపించాను. ఆ భూమిని కూడా జీవీఎంసీ వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. సింహాచలం దేవస్థానం తన భూములనే కాపాడుకోలేక పోతుంది. అటువంటి పరిస్థితుల్లో ముడసర్లోవ భూములను సింహాచలం దేవస్థానం చేతుల్లో ఉంచకుండా జీవీఎంసీ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కోరారు.




