Anakapalli: దిశ సమావేశంలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ సీఎం రమేష్ సమీక్ష

Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశంలో రైల్వే అభివృద్ధి పనులు, భూసేకరణ, ఆర్‌వోబీ, ఆర్‌యూబీల పురోగతిపై ఎంపీ సీఎం రమేష్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 5:53 PM IST
Anakapalli
X

Anakapalli: దిశ సమావేశంలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ సీఎం రమేష్ సమీక్ష

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కో-ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్, ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యంగా రైల్వే అభివృద్ధి పనులపై సీఎం రమేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో మంజూరైన రైల్వే పనులు, టెండర్లు పూర్తయిన పనులు, భూసేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROB), రైల్వే అండర్ బ్రిడ్జిలు (RUB), స్టేషన్ ఆధునీకరణ, ఎలివేటర్లు, లిఫ్టులు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎల్‌సీ నంబర్ వారీగా పనుల పురోగతిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టెండర్లు పూర్తయినప్పటికీ పనులు ప్రారంభం కాకుండా ఉన్న ప్రాంతాల్లో అడ్డంకులు ఏమిటో గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్, టెలిఫోన్ కేబుల్స్, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్ తదితర విభాగాల పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని స్పష్టం చేశారు.

కొన్ని పనులకు సంబంధించి 2024 జూన్‌లోనే టెండర్లు పిలిచి అవార్డు చేసినప్పటికీ, భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం రమేష్ స్పందిస్తూ, టెండర్ పూర్తై ఏజెన్సీ ఎంపికైన తర్వాత కూడా పనులు ఆలస్యం కావడం సరికాదన్నారు. రాష్ట్ర పరిధిలోని జాప్యాల కారణంగా పనులు నిలిచిపోకుండా సంబంధిత అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

477, 489 నంబర్లకు సంబంధించిన పనులు ప్రస్తుతం రేట్ల ఖరారు దశలో ఉన్నాయని రైల్వే అధికారులు వివరించారు. ఈ పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన భూసేకరణ, ఇతర ప్రక్రియలను వేగవంతం చేయాలని సీఎం రమేష్ సూచించారు.

అలాగే టెండర్లు పూర్తయిన పనులకు అవసరమైన భూమిని ఎన్‌కంబ్రెన్సెస్ లేకుండా అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని అన్నారు. ఆర్‌డీఓ, తహసీల్దార్ తదితర అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర, రాష్ట్ర శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం రమేష్.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదే సమయంలో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట్ల వంతెనల నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఒక రైల్వే ఫ్లైఓవర్‌కు సంబంధించి స్థానిక ప్రజలు నాలుగు చక్రాల వాహనాలు కూడా రాకపోకలు సాగించేలా నిర్మాణం చేపట్టాలని కోరుతున్న అంశాన్ని సభికులు సీఎం రమేష్ దృష్టికి తీసుకువచ్చారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులన్నింటినీ అడ్డంకులు తొలగించి వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా దిశ సమావేశంలో అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI