Vizag: అమరావతి రియల్ ఎస్టేట్ కోసం విశాఖను పణంగా పెడుతున్నారు
Vizag: కెకె లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం ఉత్తరాంధ్రకు తీరని ద్రోహమని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు విమర్శించారు.
Vizag: అమరావతి రియల్ ఎస్టేట్ కోసం విశాఖను పణంగా పెడుతున్నారు
Vizag: కెకె(కొత్తవలస- కిరండూల్) లైన్ లేకుండా విశాఖ రైల్వేజోన్ ప్రకటించడం చనిపోయిన బిడ్డను చేతిలో పెట్టినట్టుగా ఉందని, ఒడిశాలో బీజేపీ బలోపేతం కావడం కోసం ఏపీకి అన్యాయం చేస్తుంటే చంద్రబాబు నోరెత్తడం లేదని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు మండిపడ్డారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అసమర్థ, స్వార్థపూరిత విధానాల కారణంగా విశాఖతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతోందని, ఇప్పుడు కెకె లైన్ లేకుండా చేసినా ఆయనలో చలనం లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
కెకె లైన్, అరకు, కోరాపూట్ వంటి టూరిజం ప్రాంతాలు లేకుండా కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్న విశాఖ రైల్వే జోన్ హామీకి తూట్లు పొడుస్తుంటే కూటమి ఎంపీలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని చంద్రబాబు పణంగా పెడుతున్నాడని మండిపడ్డారు. కెకె లైన్‌తో కూడిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు కోసం వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని, విశాఖ అభివృద్ధిని కోరుకునే ఉత్తరాంధ్ర కూటమి నాయకులు తమతో కలిసి రావాలని కెకె రాజు పిలుపునిచ్చారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విశాఖకు రైల్వేజోన్ అంశాన్ని కూడా స్పష్టంగా పొందుపరిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఒక జట్టుగా ఏర్పడి విశాఖ నడిబొడ్డున ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో కూడా దీనిపై మూడు పార్టీల నాయకులు స్పష్టమైన ప్రకటన చేశారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పాల్గొన్న ఈ సభలో మా కూటమిని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఉత్తరాంధ్ర ప్రజల కలలు నెరవేర్చే విధంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు కలిసున్న మూడు పార్టీలు తర్వాత విడిపోయి ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఐదేళ్లు అధికారం చెలాయించారే కానీ ఇచ్చిన హామీలను మాత్రం గాలికొదిలేసి ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా వంచించారు. 2014-19 మధ్య ప్రతిపక్ష వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశాం.
కండితుడుపు చర్యగా 2019 ఎన్నికలకు నెలరోజుల ముందు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు తూతూమంత్రంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడి స్థలాన్ని కూడా కేటాయించారు. దురదృష్టవశాత్తు 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి రైల్వే జోన్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
- రాష్ట్రానికి అన్యాయం చేస్తే సంబరాలా?
కెకె (కొత్తవలస- కిరండూల్) లైన్ లేకుండా కూటమి ప్రభుత్వం ప్రకటించించడం విశాఖ రైల్వేజోన్ ప్రాణం లేని బిడ్డని చేతిలో పెట్టినట్టుగా ఉంది. సుమారు 446 కిమీల పొడవున్న ఉన్న ఈ కెకె లైన్ ఐరన్ ఓర్, మాంగనీస్, బాక్సైట్ రవాణాకి ప్రధాన మార్గంగా ఉంది. ఒడిశా, చత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ మీదు వెళ్తున్న ఈ లైన్ విశాఖ రైల్వే జోన్‌కి ప్రధాన ఆదాయ వనరు. ఈ కెకె లైన్ కారణంగానే వాల్తేర్ డివిజన్ ఆదాయం వచ్చే డివిజన్‌గా ఉంది. కానీ ఇప్పుడు కెకె లైన్ లేకుండా విశాఖ రైల్వేజోన్ ప్రకటించి ఉత్తరాంధ్రకి తీరని అన్యాయం చేశారు.
ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీని బలోపేతం చేయడం కోసం కెకె లైన్‌ను ఒడిశా ప్రాంతానికి ఇచ్చేసి ఏపీకి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీ స్వార్థపూరిత రాజకీయాల కారణంగా విశాఖ రైల్వే జోన్ అరకు, కోరాపుట్ వంటి పర్యాటక ప్రాంతాలను కూడా కోల్పోయింది. వాల్తేరు డివిజన్ దేశంలోనే అత్యధిక ఆదాయం సాధిస్తోందంటే దానికి కారణం కెకె లైన్. వైయస్సార్సీపీ పోరాటం ఫలితంగానే నౌపాడ, పలాస సబ్ డివిజన్లను కొనసాగించారు.
లేదంటే వాటిని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడేది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇంత ద్రోహం చేస్తుంటే చంద్రబాబు మాత్రం దీనిపై కనీసం నోరు మెదపడం లేదు. అమరావతిలో ఆస్తులు పెంచుకోవడంలో తప్ప ఉత్తరాంధ్ర, విశాఖ గురించి ఆలోచించే తీరిక చంద్రబాబుకి లేదు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ వల్ల ఈ ప్రాంతానికి ఒనగూరే ప్రయోజనం శూన్యం. విశాఖ రైల్వే జోన్ రాబోయే రోజుల్లో మనకి భారంగా మారే ప్రమాదం ఉంది.
- వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ఉద్యమిస్తాం
కెకె లైన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. కూటమి నాయకులకు
విశాఖ రైల్వే జోన్ విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కూటమి నాయకులంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలి. కెకె లైన్ లేని విశాఖ రైల్వే జోన్ ప్రకటించారని కేంద్రంపై పోరాటం చేయాల్సిందిపోయి విశాఖ ఎంపీ స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నాడంటే అంతకన్నా నీచం ఇంకోటి ఉండదు. కెకె లైన్ తీసేయడం వల్ల కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో ఆలోచించడం లేదు.
- ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి?
విశాఖ లోని వేల కోట్ల విలువైన భూములను పెట్టుబడులు, సాఫ్ట్‌వేర్ కంపెనీల ఏర్పాటు పేరుతో చంద్రబాబు బినామీలకు పప్పు బెల్లాలకు కట్టబెట్టడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏడాది కిందట భూములు పొందిన ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పటికీ విశాఖలో కాలు పెట్టలేదు. శంకుస్థాపన చేసి వెళ్లిపోయాయే కానీ పనుల చేయడంలేదని టీడీపీ కరపత్రిక కూడా రాసిందంటే ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా విశాఖ భూములను దోచిపెడుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ లెక్కన వారు కంపెనీలు ప్రారంభించేది ఎప్పుడు, యువతకు ఉద్యోగాలిచ్చేదెప్పుడు? ఒకేసారి 9 కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేసి ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేసి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాడు. కానీ ఇంతవరకు కనీసం వంద ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిపోతుందని చంద్రబాబు భయం. అమరావతి కోసం విశాఖ అభివృద్ధిని చంద్రబాబు పణంగా పెడుతున్నాడు. విశాఖకు రైల్వేజోన్ విషయంలోనూ చంద్రబాబు ఇదే విధానం పాటించాడని కెకె రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశం లో నియోజకవర్గం సమన్వయ కర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , మొల్లి అప్పారావు , జిల్లా పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి , డిప్యూటీ మేయర్ కట్టమురి సతీష్ , రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ , మాజీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు జీల కర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.




