Anakapalli: దేశభక్తి వెల్లువ: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' భారీ సైకిల్!
Anakapalli: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అనకాపల్లిలో 'హర్ ఘర్ తిరంగా' భారీ సైకిల్ ర్యాలీ.ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభం.
Anakapalli: దేశభక్తి వెల్లువ: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' భారీ సైకిల్!
అనకాపల్లి: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా గురువారం భారీ సైకిల్ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అనకాపల్లి ప్రధాన రహదారులు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి.
కలెక్టర్ విజయ్ కృష్ణన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని అనకాపల్లి మార్కెట్ యార్డ్ నుంచి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ్ కృష్ణన్ సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా మార్కెట్ యార్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, స్కేటింగ్ విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. “వందే భారత్.. జై భారత్” అంటూ నినదిస్తూ సైకిళ్లు, స్కేటింగ్‌తో ముందుకు సాగిన విద్యార్థులు దేశభక్తిని చాటారు. మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా నెహ్రూ చౌక్ వరకు సాగింది.
ర్యాలీకి దారి పొడవునా ప్రజలు ఆసక్తిగా వీక్షించడంతో పాటు విద్యార్థులను ప్రోత్సహించారు. జాతీయ జెండాలతో కదిలిన సైకిళ్లు, విద్యార్థుల నినాదాలతో అనకాపల్లి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. నెహ్రూ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన జాతీయ పండుగ అని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
భారతదేశం అభివృద్ధిలో మరింత ముందుకు సాగి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ సమైక్యతను చాటేలా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు అనకాపల్లిలో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




