Vizag: జీవీఎంసీలో విలీనాన్ని వ్యతిరేకించిన గండిగుండం ప్రజలు!
Vizag: ఆనందపురం మండలం గండిగుండం పంచాయతీని జీవీఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను గ్రామసభ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ సంతకాలతో కూడిన తీర్మానం చేసింది.
Vizag: జీవీఎంసీలో విలీనాన్ని వ్యతిరేకించిన గండిగుండం ప్రజలు!
Vizag: గ్రామ పంచాయతీని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్వహించిన గ్రామ సభలో గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. గ్రామ సభలో పాల్గొన్న ప్రజల్లో ఒక్కరు కూడా GVMCలో విలీనానికి అనుకూలంగా తమ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు మూకుమ్మడిగా తమ సంతకాలను నమోదు చేసి, తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని స్పష్టంగా కోరారు.
ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గ్రామాలను బలవంతంగా GVMCలో విలీనం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామానికి సంబంధించిన పరిపాలన, స్థానిక అవసరాలు, గ్రామ ప్రజల నిర్ణయాధికారం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ గ్రామ సభలో నమోదైన ప్రజల ఏకగ్రీవ వ్యతిరేకతను అధికారికంగా పరిగణనలోకి తీసుకుని, ఇంకా సరైన అభివృద్ధిని నోచుకోని పంచాయతీని ను GVMCలో విలీనం చేసే ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామ సభ ద్వారా కోరారు.
“ప్రజల అభిప్రాయమే ప్రజాస్వామ్యానికి పునాది ప్రజలు వద్దంటున్న విలీనాన్ని ప్రభుత్వం ఎందుకు బలవంతంగా చేయాలి?” గ్రామ ప్రజల ఏకగ్రీవ నిర్ణయాన్ని గౌరవించే వరకు ఈ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాము అని ప్రజలందరూ తెలిపారు.
“ఒక పంచాయతీ నుంచి మొదలైన ఈ ప్రజా నిర్ణయం… అన్ని మండలాల పంచాయతీలకు దిశానిర్దేశం కావాలి.” అభివృద్ధి లేని విలీనం వద్దు గ్రామాలే ముద్దు అనే నినాదం ప్రజలందరూ ముక్తకంఠంతో ఇచ్చారు. ఈ గ్రామ సభలో పంచాయతీ ఎమ్మార్వో శ్రీను బాబు, వీఆర్వో పంచాయతీ సెక్రెటరీ మరియు సర్పంచ్ గండేడి శ్రీనివాస్ మరియు ప్రజలు పాల్గొన్నారు.




