Anakapalli: యూనిఫామ్ ధరించి విద్యార్థులతో కలిసి డీఈఓ సందడి

Anakapalli: అనకాపల్లి జిల్లాలో వినూత్నంగా 'మనబడి – మన పండగ'. విద్యార్థుల యూనిఫామ్ ధరించి పాఠశాలకు హాజరైన డీఈఓ గిడ్డి అప్పారావు నాయుడు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 13 Jun 2026 12:05 PM IST
Anakapalli
X

Anakapalli: యూనిఫామ్ ధరించి విద్యార్థులతో కలిసి డీఈఓ సందడి

Anakapalli: ఏపీలో కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి.

ఎక్కడ చూసినా విద్యార్ధులు పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలే కనిపించాయి. ఇదే క్రమంలో అనకాపల్లి జిల్లాలోని ఓ స్కూల్లో మాత్రం ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఈ దృశ్యం ఆ పాఠశాలలో విద్యార్ధులకు అంత వింతగా అనిపించకపోయినా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ను మాత్రం నిజంగానే కదిలించింది.

అనకాపల్లి జిల్లా చోడవరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ ను జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు సందర్శించారు. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న సందర్భంగా అక్కడి విద్యార్దులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు

ఆయన ఈ రెండు స్కూల్లకు వెళ్లారు. అయితే ఆయన సాధారణ దుస్తుల్లో కాకుండా స్కూలు విద్యార్ధులు ధరించిన యూనిఫామ్ ను కుట్టించుకుని, వేసుకుని మరీ వెళ్లారు. దీంతో డీఈవో స్కూలు యూనిఫామ్ లో ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్పందించారు. "ఐక్యత- క్రమశిక్షణకు చిహ్నమైన యూనిఫామ్ ధరించిన విద్యార్థుల్లో తానూ ఒకరై అందరికీ ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు గారికి అభినందనలు. వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభం అయిన చోడవరం మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు యూనిఫామ్ ధరించిన డీఈవో, విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రార్థనలో పాల్గొని, ప్రతిజ్ఞ చేయడం స్ఫూర్తిదాయకం." అంటూ లోకేష్ ఆయన్ను అభినందించారు.

"మనబడి – మన పండగ" కార్యక్రమంలో భాగంగా చోడవరంలో ZPH బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నూతన విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఫైవ్ స్టార్ చాక్లెట్లు, ఆపిల్స్ అందించి ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన, ఆధునిక విద్యను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇటీవల ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ హైస్కూల్లో చేరిన విద్యార్థులతో ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు, ప్రతిభాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వం విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ను తన సొంత ఖర్చుతో కుట్టించుకొని, అదే యూనిఫామ్ ధరించి విద్యార్థుల మధ్య ఒక విద్యార్థిలా కలిసిమెలసి పాల్గొన్నారు. ఈ దృశ్యం విద్యార్థులను మాత్రమే కాకుండా ఉపాధ్యాయులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల గౌరవం, అనుబంధం పెంపొందించాలనే ఆయన సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story